Rishab Shetty: ఓ వైపు సినిమాలంటే ఇష్టం.. కానీ పొట్ట నింపుకునేందుకు వాటర్ క్యాన్లను సరఫరా చేయాల్సి వచ్చింది. అయినా పట్టుదలతో సినిమా రంగంలోకి అడుగుపెట్టినా.. అడ్డంకుల స్వాగతం.. వీటిని అధిగమించినా.. నష్టాల జీవితం.. ఇలా ఎన్నో ఎదురుదెబ్బలు.. అవమానాలు.. ఇవన్నీ ఇప్పుడు ఆయన నుంచి మాటుమాయమైపోయాయి. ఫిల్మ్ ఇండస్ట్రీనే తనను వెతుక్కుంటూ వస్తోంది.. ఆయన కోసం దర్శకులు, నిర్మాతలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి.. ఆయనే మన ‘కాంతార’ హీరో రిషబ్ శెట్టి.. పాన్ ఇండియా లెవల్లో రిషబ్ శెట్టి పేరు మారుమోగుతోంది. ఈ సినిమాతో ఆయనకు దేశవ్యాప్తంగా ఇమేజ్ వచ్చింది. రిషబ్ శెట్టి ఇంతటి స్థితికి రావడానికి సినీ బ్యాక్రాండ్ లేదు.. డబ్బు అంతకన్నా లేదు.. మరి ఆయన ఎలాంటి కృషి చేశారు..? ఏ కష్టాలను ఎదుర్కొన్నారు..?

కర్ణాటక రాష్ట్రంలో ఉడుపి జిల్లాలోని కెరాడి అనే గ్రామంలో రిషబ్ శెట్టి జన్మించారు. ఆయనకు పెద్దగా ఆస్తులు లేవు. కానీ నాన్న జ్యోతిష్యం ద్వారా కుటుంబ అవసరాలకు ఆదాయం వచ్చేంది. ఆయనకు అక్క, అన్న ఉండేవారు. చిన్నప్పుడు దూరదర్శన్ లో వచ్చే కన్నడ పాటలు బాగా చూసేవాడు. తాను కూడా రాజ్ కుమార్ లా హీరో అవ్వాలని కలలు కనేవాడు. అయితే అప్పుడప్పుడు నాటకాల్లో పాల్గొనడానికి వెళ్తుండేవారు. ఓసారి ‘మీనాక్షి కల్యాణం’ అనే యక్షగాన ప్రదర్శనలో ఆయన షణ్ముగ పాత్ర చేశారు.
ఓం, ష్.. లాంటి సినిమాలతో ఫేమస్ అయిన ఉపేంద్ర కూడా రిషబ్ శెట్టి ప్రాంతానికి చెందిన వాడే. దీంతో ఆయనకు ఉపేంద్ర లాంటి స్థాయికి రావాలని కోరిక ఉండేది. అయితే అప్పటి వరకు నటించాలని అనుకున్న ఆయన సినిమాకు దర్శకుడిగా మారాలని నిర్ణయించుకున్నాడు. అయితే రిషబ్ వాళ్ల నాన్నకు ఇవంటే ఇష్టం లేదు. కానీ మంచి చదువుల కోసం బెంగుళూరుకు పంపించాడు. బెంగుళూరులోని డిగ్రీ కాలేజీలో జాయిన్ అయిన రిషబ్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో శిక్షణ పొందాడు.
అయితే ఈ శిక్షణ కోసం డబ్బు అవసరం ఉండేది. తన ఖర్చులకు అక్క డబ్బులు ఇస్తుండేది. కానీ ఎన్ని రోజులు ఇలా ఆధారపడాలి..? అని అనుకొని మినరల్ వాటర్ క్యాన్లు సప్లయ్ చేసే పనిలో చేరాడు. దీంతో వచ్చిన డబ్బు ఎక్కువ రోజులు నిల్వలేదు. ఇలా వాటర్ క్యాన్లు సరఫరా చేస్తున్న సమయంలో కన్నడ నిర్మాత ఎం.డి ప్రకాశ్ వస్తే ఏదైనా అవకాశం ఇప్పించాలని అడిగాడు. ముందు నిరాకరించినా ఆ తరువాత ‘సైనైడ్’ అనే చిత్రంలో సహాయ దర్శకుడిగా అవకాశం ఇచ్చారు.
అయితే అక్కడ లైట్ బాయ్ లాంటి వారు రాకపోయినా ఆ పనిచేయాల్సి వచ్చేది. ఇలా చేసినందుకు రోజుకు రూ.50 రూపాయలు ఇచ్చేవారు. కానీ ఇంటి నుంచి షూటింగ్ స్పాట్ కు వెళ్లేందుకు రిషబ్ కు రూ.100 ఖర్చయ్యేది. ఇలా నెట్టుకొస్తున్న తరుణంలో ఆ సినిమా మొత్తానికే ఆగిపోయింది. ఆ తరువాత మళ్లీ వాటర్ క్యాన్ ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. ఆ తరువాత దర్శకుడు రవి శ్రీ వత్స తీస్తున్న ‘గండ హెండతి’ యూనిట్ లో క్లాప్ కొట్టే వ్యక్తిగా జాబ్ చేయాల్సి వచ్చింది. అక్కడ ఏడాది పాటు పనిచేయగా రూ.1500 వచ్చింది. దీంతో ఇక సినిమాల జోలికి వెళ్లద్దని నిర్ణయించుకున్నాడు.
ఉన్న డబ్బుతో పాటు కొంత అప్పు చేసి 2009లో హోటల్ వ్యాపారం మొదలు పెట్టాడు. కానీ కేవలం 5 నెలల్లోనే అది నష్టాలను చూసింది. అంత పోయి రూ.25 లక్షల అప్పు మిగిలింది. ఈ అప్పులకు వడ్డీ కట్టేందుకు కొత్త అప్పులు చేయాల్సి వచ్చింది. ఇలా 2012 వరకు అప్పులు కడుతూ వచ్చిన ఆయనకు మళ్లీ సినిమాల్లోకి వెళ్లాలన్న కోరిక పుట్టింది. అయితే గాంధీనగర్ లో చిన్న చిన్న చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి. అప్పులోళ్ల బాధ నుంచి తప్పించుకునేందుకు సినిమాలోని వేషాలతోనే బయట తిరిగాడు. ఈ క్రమంలో ఓ సీరియల్ లో రోజుకు రూ.500 చొప్పున అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాడు.
ఈ క్రమంలో దర్శకుడు అరవింద్ కౌశిక్ తో పరిచయం కాగా.. అతను రక్షిత్ శెట్టితో ‘తుగ్లక్’ సినిమా తీశాడు. ఆ సినిమా ప్లాప్ కావడంతో అతడు కుంగిపోయాడు. దీంతో అప్పటికే కథ రెడీ చేసుకున్న రిషబ్ శెట్టి ‘రిక్కీ’ పేరుతో రక్షిత్ శెట్టితో సినిమా తీశాడు. ఈ సినిమా పెద్ద హిట్టయింది. అప్పటి నుంచి రిషబ్ దశ తిరిగింది. ఆ తరువాత వరుసగా సినిమాలు తీస్తూ ‘కాంతార’ రు తీశాడు. ఉడుపి జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో జరిగిన సంఘటనలపై ఎప్పుడో సినిమా తీయాలని అనుకున్నానని, ఇప్పుడు అవకాశం వచ్చి నా కల నెరవేర్చుకున్నానని రిషబ్ శెట్టి ఈ సందర్బంగా మీడియాకు తెలిపారు.