RGV Vyuham: రాంగోపాల్ వర్మ “వ్యూహం” సినిమా విడుదకు లైన్ క్లియర్ అయ్యింది. ఏపీ సీఎం జగన్ బయోపిక్ గా, పొలిటికల్ సెటైరికల్ మూవీగా వ్యూహం సినిమాను రాంగోపాల్ వర్మ చిత్రీకరించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును నెగిటివ్ గా చూపించబోతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఇందుకు సంబంధించి విడుదలైన టీజర్ సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో టిడిపి అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో చిత్రం విడుదల వాయిదా పడింది.
రామ్ గోపాల్ వర్మ గత కొద్దిరోజులుగా వైసీపీతో సన్నిహితంగా వ్యవహరిస్తున్నారు. ఆ పార్టీ నాయకుడిగా ప్రవర్తిస్తున్నారు. ఈ తరుణంలోనే ఆయన కొన్ని పొలిటికల్ సెటైరికల్ చిత్రాలను రూపొందించారు. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు వంటి సినిమాలను తెరకెక్కించారు. ఇప్పుడు వ్యూహం సినిమాతో ఆకట్టుకోవాలని భావించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదం తరువాత పరిణామాలతో.. జగన్ ఎదుర్కొన్న జైలు జీవితం, రాజకీయ పరిణామాలు, పాదయాత్ర, అధికారంలోకి వచ్చే కీలక ఘట్టాలను రెండు పార్టులుగా చూపించనున్నారు. అందులో భాగంగా వ్యూహం సినిమాను చిత్రీకరించి రిలీజ్ కు సిద్ధం చేశారు. అప్పుడే టిడిపి అభ్యంతరాలతో బ్రేక్ పడింది.
టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ సెన్సార్ బోర్డు కు ప్రత్యేకంగా లేఖ రాశారు. రాజకీయ దురుద్దేశంతోనే ఈ చిత్రాన్ని రూపొందించారని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తెలంగాణ ఎన్నికల దృష్ట్యా రాజకీయ లబ్ధి పొందేందుకు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారని.. ఈ సినిమాతో తమ పరువుకు భంగం వాటిల్లుతుందని.. అవసరమైతే తానే స్వయంగా వచ్చి వివరణ ఇస్తానని లోకేష్ లేఖ రాయడం విశేషం. దీనిపై స్పందించిన సెన్సార్ బోర్డు సినిమా విడుదలను వాయిదా వేసుకోవాలని చిత్ర యూనిట్కు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఇప్పుడు తెలంగాణ ఎన్నికలు పూర్తి కావడంతో సెన్సార్ బోర్డు నుంచి అనుమతి లభించినట్లు సమాచారం. అయితే ఇదే విషయాన్ని తనదైన స్టైల్ లో చెప్పారు ఆర్జీవి. ” బ్యాడ్ పీపుల్ కి బ్యాడ్ న్యూస్. వ్యూహం సెన్సార్ సర్టిఫికెట్ ఇదిగో ” అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు ఆర్జీవి. ఈ నెల 29న సినిమాను విడుదల చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో అజ్మల్ జగన్ పాత్రలో, మానస భారతి రెడ్డి పాత్రలో నటిస్తున్నారు. దాసరి కిరణ్ కుమార్ ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్, టీజర్ రాజకీయంగా సృష్టించాయి. ఇప్పుడు ఏకంగా సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ లభించడం విశేషం.