నటీనటులుః రాజశేఖర్, స్వాతి దీక్షిత్, తనికెళ్ల భరణి, అనితా చౌదరి, జీవా తదితరులు
దర్శకత్వంః రామ్ గోపాల్ వర్మ
నిర్మాణంః జీవితా రాజశేఖర్, నట్టి కరుణ, నట్టి క్రాంతి, బోగారం వెంకటశ్రీనివాస్
సంగీతంః డీఎస్ఆర్
రిలీజ్ డేట్ః 16 ఏప్రిల్, 2021
కథః రాజశేఖర్ ఒక మెకానిక్ గ్యారేజ్ నడుపుతుంటాడు. ఆయనకు కూతురు విజ్జి (స్వాతి దీక్షిత్) అంటే ప్రాణం. అలాంటి కూతురు ఒంట్లోకి గురు అనే వ్యక్తి ఆత్మ ప్రవేశిస్తుంది. దీంతో.. అప్పటి వరకూ ఆనందంగా సాగుతున్న కుటుంబంలో ఆందోళన మొదలవుతుంది. అశాంతి తిష్ట వేస్తుంది. అసలు గురు ఎవరు? ఎందుకు విజ్జి దేహంలోకి ప్రవేశించింది? ఎలాంటి ఇబ్బందులు పెట్టింది? చివరకు ఏమైంది అన్నది కథ.
పెర్ఫార్మెన్స్ః గ్యారేజ్ ఓనర్ గా.. కూతురిని కాపాడుకునే తండ్రిగా రాజశేఖర్ అద్భుతంగా నటించారు. ఇక దెయ్యం పట్టిన అమ్మాయిగా స్వాతి దీక్షిత్ కూడా బాగా నటించింది. దాదాపుగా సింగిల్ ఎక్స్ ప్రెషన్ తోనే కనిపించిన స్వాతి.. ఆద్యంతం ఆకట్టుకుందని చెప్పొచ్చు. మిగిలిన వారు కూడా తమ పాత్రల పరిధిమేరకు నటించారు.
సాంకేతిక అంశాలుః హారర్ సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రాణం వంటిది. ఆ విషయంలో డీఎస్ఆర్ పనితీరు బాగుంది. ఇక,సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకుంది. లైటింగ్ వంటి అంశాల్లో బాగా ఫోకస్ చేశారు. ఇక, నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.
విశ్లేషణః సస్పెన్స్ థ్రిల్లర్ కు ఉన్న ప్లస్ పాయింట్స్ ఏమంటే.. ప్రేక్షకులను కుర్చీలకు కట్టిపడేసే ఛాన్స్ బోనస్ గా ఉంటుంది. ఇక దెయ్యం సినిమా అంటే.. చెప్పాల్సిన పనిలేదు. దెయ్యం మూవీ అనగానే కొందరిని పీడించే ఆత్మ అన్న సంగతి ప్రేక్షకుడికి థియేటర్లోకి వెళ్లక ముందే తెలిసిపోతుంది. ఇక దర్శకుడు చేయాల్సింది వాళ్ల ఊహలకు అందకుండా కథను నడిపించడమే. ఊహించని ట్విస్టులతో భయపెట్టడమే! ఈ విషయంలో రామ్ గోపాల్ వర్మది అందెవేసిన చెయ్యి. దెయ్యాల సినిమాలో ప్రొఫెసర్లకే ఆర్జీవీ గురువు వంటివాడు. కానీ.. ఈ సినిమాలో ఆయన అనుభవం పూర్తిస్థాయిలో కనిపించదు. నిజానికి ఇది ఏడు సంవత్సరాల క్రితమే విడుదల కావాల్సిన సినిమా. అనివార్య కారణాలతో ఇన్నాళ్లూ దాచిపెట్టి, ఇప్పుడు రిలీజ్ చేశారు. ఆ గ్యాప్ స్క్రీన్ పైనా కనిపిస్తుంది. ఇక, ఈ గ్యాప్ లో తెలుగులో చాలా దెయ్యం సినిమాలు వచ్చేశాయి. అందువల్ల ఫస్టాఫ్ మొత్తం రొటీన్ సినిమా చూస్తున్నామన్న భావన కలుగుతుంది. సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అయితే.. హారర్ సినిమాలను ఇష్టపడే వారు ఓ సారి వెళ్లి రావొచ్చు. మొత్తంగా చూస్తే.. ఆర్జీవీ ఫ్యాక్టరీలోంచి మరోసినిమా వచ్చింది అనిపిస్తుంది.
బలాలుః రాజశేఖర్, స్వాతిదీక్షిత్, బ్యాగ్రౌండ్ స్కోర్
బలహీనతలుః రొటీన్ కథనం, జవాబు తెలియని ప్రశ్నలు
లాస్ట్ లైన్ః కొత్తింట్లో పాత ‘దెయ్యం’!
రేటింగ్ః 2/5