Flops in Tamil movies: దక్షిణాదిలో తమిళ సినిమా ఇండస్ట్రీ పెద్దన్న పాత్ర పోషిస్తోంది. ఒకప్పుడు తమిళ సినిమాలన్నీ కూడా తెలుగుతోపాటు ఇతర భాషల్లో రిలీజై మంచి విజయాలు సాధించేవి. అయితే కొంతకాలంగా ప్రేక్షకుల టేస్ట్ మారిపోయింది. దీనికి తగ్గట్టుగా అరవ దర్శకులు సినిమాలు తీయడం లేదు. దీంతో వరుసబెట్టి బాక్సాఫీసు వద్ద తమిళ సినిమాలన్నీ ప్లాప్ టాక్ తెచ్చుకొని ప్రేక్షకులను నిరాశ పరుస్తున్నాయి.
ప్రస్తుతం తమిళ సినిమాల కంటే తెలుగు, మలయాళం సినిమాలు బాక్సాఫీస్ వద్ద వరుసగా హిట్ కొడుతున్నాయి. టాలీవుడ్ సినిమాలైతే ఏకంగా ప్యాన్ ఇండియా లెవల్లో మేకింగ్ అవుతూ విడుదలైన అన్ని భాషల్లో సత్తాచాటుతున్నాయి. ప్రేక్షకుడి అభిరుచిగా తగ్గట్టుగా ఇక్కడి దర్శకులు కథలో మార్పులు చేస్తూ సాంకేతికతను వినియోగించుకొని హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తున్నారు.
ఈ కారణంగానే టాలీవుడ్ సినిమాలన్నీ కూడా ఇటీవల కాలంలో భారీ విజయాలు సాధిస్తున్నాయి. ‘బాహుబలి’, ‘పుష్ప’, ‘ఆర్ఆర్ఆర్’ విజయాలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. మరోవైపు తమిళ స్టార్ హీరోల సినిమాలన్నీ కూడా వరుసబెట్టి ప్లాపు అవుతున్నాయి. తమిళ దర్శకులు మూస పద్ధతిలోనే సినిమాలు తీస్తుండటం ఇందుకు ప్రధాన కారణమనే టాక్ విన్పిస్తోంది.
కేవలం హీరోను ఎలివేట్ చేస్తూ కథ లేకుండా సినిమాలు తీస్తుండటంతో తమిళ ప్రేక్షకులు సైతం విసిగిపోతున్నారు. ఎన్నాళ్లీ ఈ మూస కథలనే తీస్తారంటూ ప్రేక్షకులు సైతం నిర్మోహమాటంగా సినిమాలను తిరస్కరిస్తున్నారు. దీంతో స్టార్ హీరోల సినిమాల సైతం బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్లుగా మిగిలిపోతున్నాయి.
ఇటీవల విడుదలైన తమిళ దళిపతి విజయ్ ‘బీస్ట్’ సినిమా ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. రెగ్యులర్ స్టోరీ, రోటీన్ స్క్రీన్ ప్లే, లాజిక్ లేని సీన్స్, స్లో నేరేషన్.. అన్నీ కలిసి విజయ్ బీస్ట్ ప్రేక్షకులకు పరీక్షను పెట్టాయి. ఎన్నో అంచనాలతో సినిమా వస్తే బీస్ట్ సినిమా నిరాశను మిగిల్చిందని ఓ అభిమాని థియేటర్ కు ఏకంగా నిప్పుపెట్టడం సంచలనంగా మారింది.
విజయ్ ‘బీస్ట్’ కంటే ముందుగా వచ్చిన అజిత్ ‘వలిమై’ కూడా కేవలం కథ లేకుండా రేస్, యాక్షన్ ఎలిమెంట్స్ తో వచ్చింది. ఈ సినిమాను సైతం జనం తిప్పొకట్టారు. అలాగే ‘ఆకాశమే నీ హద్దురా’, ‘జై భీమ్’ చిత్రాలతో ఆకట్టుకున్న సూర్య ‘ఈటీ’తో నిరాశ పరిచాడు. ఈ లిస్టులో సూపర్ స్టార్ రజని, ధనుష్ లాంటి స్టార్ హీరోలు కూడా ఉన్నారు.
సోల్ లేకుండా సినిమా తీస్తే ఒప్పుకునేది లేదని తమిళ ప్రేక్షకులు చెప్పేస్తున్నాడు. ఇప్పటికైనా దర్శకులు తమ ప్రతిభను పదును పెట్టాల్సిన అవసరం ఉంది. లేనట్లయితే తమిళ దర్శకులతోపాటు హీరోలు సైతం తగిన మూల్యం చెల్లించకపోక తప్పదు. ఈ క్రమంలోనే పలువు తమిళ స్టార్ హీరోలు తెలుగు దర్శకులను లైన్లో పెట్టి ప్యాన్ ఇండియా స్థాయిలో హిట్టు కొట్టాలని ఆశ పడుతున్నారు.