Ram Charan : ‘గేమ్ చేంజర్’ లాంటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ సినిమా తర్వాత రామ్ చరణ్ , బుచ్చి బాబు కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ‘గేమ్ చేంజర్’ విడుదల కాకముందే మొదలైంది. రేపటి నుండి హైదరాబాద్ లో సరికొత్త షెడ్యూల్ ని ప్రారంభించుకోబోతున్న ఈ సినిమాకి ‘పెద్ది’ అనే టైటిల్ ని పెట్టేందుకు పరిశీలిస్తున్నారు మేకర్స్. అందరికీ ఆ టైటిల్ నచ్చడంతో, దాదాపుగా ఖరారు అయిపోయినట్టే. సాధ్యమైనంత తొందరగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసి, ఈ ఏడాది అక్టోబర్ నెలలో విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. రామ్ చరణ్ అభిమానులు ఒక్క సక్సెస్ కోసం మొహం వాచిపోయేలా ఎదురు చూస్తున్నారు. ‘రంగస్థలం’ చిత్రం తర్వాత #RRR ని మినహాయిస్తే, రామ్ చరణ్ నటించిన సినిమాలన్నీ డిజాస్టర్ ఫ్లాప్స్ అయ్యాయి.
#RRR కి ముందు వచ్చిన ‘వినయ విధేయ రామ’, #RRR కి తర్వాత వచ్చిన ‘ఆచార్య’, ‘గేమ్ చేంజర్’ చిత్రాలు చాలా గట్టి దెబ్బలు కొట్టాయి. దీంతో తదుపరి రాబోయే సినిమాతో రామ్ చరణ్ చరిత్ర సృష్టించే విధంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇప్పటికే బుచ్చి బాబు తో చేయబోయే సినిమా తన కెరీర్ లో ‘రంగస్థలం’ కి మించి ఉంటుందని రామ్ చరణ్ ఇది వరకే ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. పల్లెటూరులో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో రామ్ చరణ్ కేవలం ఒక్క ఆట లో కాదు, అన్ని రకాల ఆటల్లో ఆరితేరిన క్రీడాకారుడిగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ రామ్ చరణ్ కి కుస్తీ కోచ్ గా నటిస్తున్నాడు. ఉగాది సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర కోసం, బాలీవుడ్ సూపర్ స్టార్స్ లో ఒకరైన రణబీర్ కపూర్ ని ఇటీవలే కలిశాడట డైరెక్టర్ బుచ్చి బాబు. ఆయనకీ ఈ స్టోరీ, అదే విధంగా ఆయన పాత్ర గురించి వివరంగా చెప్పగా, ఆయనకీ బాగా నచ్చిందని, డేట్స్ ఎప్పుడు కావాలో అడగమని చెప్పినట్టుగా తెలుస్తుంది. రణబీర్ కపూర్ మన టాలీవుడ్ ఆడియన్స్ కి ‘బ్రహ్మాస్త్ర’, ‘ఎనిమల్’ వంటి చిత్రాల ద్వారా సుపరిచితుడయ్యాడు. వాస్తవానికి ఈ పాత్ర కోసం ముందుగా తమిళ హీరో సూర్య ని అనుకున్నారు. కానీ ఇప్పుడు చివరికి రణబీర్ కపూర్ వద్దకు చేరింది. రామ్ చరణ్,రణబీర్ కపూర్ కలయిక పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కేవలం ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రమే కాకుండా, ఓవర్సీస్ లో కూడా ఈ కాంబినేషన్ వండర్స్ ని క్రియేట్ చెయ్యొచ్చు.