Ram Charan- Director Buchi Babu: అదృష్టం అంటే బుచ్చిబాబుదే. డెబ్యూ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ యంగ్ డైరెక్టర్ రెండో చిత్రమే రామ్ చరణ్ తో చేసే అవకాశం దక్కించుకున్నాడు. రామ్ చరణ్ తన 16వ చిత్రం బుచ్చిబాబు డైరెక్షన్ లో చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. పాన్ ఇండియా మూవీగా భారీ ఎత్తున నిర్మిస్తున్నట్లు మేకర్స్ తెలియజేశారు. సడన్ గా రామ్ చరణ్ దర్శకుడు బుచ్చిబాబుతో మూవీ కమిట్ కావడం పరిశ్రమలో ఆసక్తికర చర్చకు దారితీసింది.

సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు ఉప్పెన మూవీతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు. గత ఏడాది విడుదలైన ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ ఉప్పెన బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. భారీ లాభాలు మిగిల్చిన చిన్న చిత్రాల జాబితాలో చేరింది. బుచ్చిబాబు టాలెంట్ కి ఫిదా అయిన మేకర్స్ కొందరు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. అయితే ఎన్టీఆర్ తో మూవీ చేయాలని పట్టుబట్టి కూర్చున్నాడు . ఆయన కోసం ఒక విలేజ్ స్పోర్ట్స్ డ్రామా సిద్ధం చేశారు. బుచ్చిబాబు స్క్రిప్ట్ నచ్చినప్పటికీ ఎన్టీఆర్ వెంటనే మూవీ చేసే పరిస్థితి లేదు.
కొరటాల శివ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. అనంతరం దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో మూవీ చేస్తాడు. దీంతో బుచ్చిబాబు రామ్ చరణ్ కి షిఫ్ట్ అయ్యాడు. రామ్ చరణ్ తో సుకుమార్ కి మంచి సాన్నిహిత్యం ఉంది. రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ సుకుమార్ చరణ్ కి ఇచ్చాడు. దీంతో బుచ్చిబాబుతో ప్రాజెక్ట్ సెట్ చేసినట్లు సమాచారం. సుకుమార్ నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ తో అనుకున్న కథే ఇది అని తెలుస్తుంది. రామ్ చరణ్ ఈ ప్రాజెక్టు ఓకే చేయడానికి ఎన్టీఆర్ కూడా కారణం అంటున్నారు. స్క్రిప్ట్ విన్నాక నచ్చితే చేయమని ఎన్టీఆర్ చరణ్ కి సూచించాడనే ఒక వాదన వినిపిస్తోంది.

ఏది ఏమైనా… బుచ్చిబాబు-రామ్ చరణ్ మూవీ పై అధికారిక ప్రకటన వచ్చేసింది. వీలైనంత త్వరగా రెగ్యులర్ షూట్ స్టార్ట్ కానుందట. ప్రస్తుతం రామ్ చరణ్ ఆర్సీ 15 పూర్తి చేసే పనిలో ఉన్నారు. దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ చిత్ర ప్రస్తుత షెడ్యూల్ విదేశాల్లో జరుగుతుంది. ఇక ఆర్ ఆర్ ఆర్ మూవీతో పాన్ ఇండియా ఫేమ్ అందుకున్న రామ్ చరణ్ అంతగా అనుభవం లేని బుచ్చిబాబుకు ఛాన్స్ ఇవ్వడం ఒక విధంగా సాహసమనే చెప్పాలి.