
దర్శక దిగ్గజం రాజమౌళి ఇండస్ట్రీలో అపజయాలు లేకుండా దూసుకెళుతోన్నారు. ‘బాహుబలి’ సిరీసులతో టాలీవుడ్ రేంజ్ ను రాజమౌళి ప్రపంచవ్యాప్తం చేశారు. ఆయన సినిమాలన్నీ భారీ బడ్జెట్లోనే తెరకెక్కుతుంటాయి. భారీతారాగాణంతో సినిమాలను నిర్మిస్తుంటారు. రాజమౌళి తన సినిమాలకు ఎంత ఎక్కువ సమయం తీసుకుంటే అంత భారీ హిట్టవుతుందని ఫిల్మ్ నగర్లో టాక్. ఇక ఆయన సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ కూడా ఓ రేంజ్లో ఉంటాయి. ఆయన ప్రతీ సినిమాలో ఓ స్పెషల్ ఐటమ్ సాంగ్ ఉండాల్సిందే.. ప్రస్తుతం రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మూవీ ‘RRR’. ఈ మూవీలోనూ ఓ స్పెషల్ సాంగ్ ఉండనుందని ప్రచారం జరుగుతోంది. ఈ ఐటమ్ సాంగ్ లో ఓ టాలీవుడ్ హీరోయిన్ కన్పించనుందని ప్రచారం జరుగుతుంది.
లాక్డౌన్ కారణంగా ‘RRR’ షూటింగ్ వాయిదా పడిన సంగతి తెల్సిందే. ఇటీవలే తెలుగు రాష్ట్రాల సీఎంలు షూటింగులకు అనుమతి ఇవ్వడంతో త్వరలో ‘RRR’ పట్టాలెక్కనుంది. ఈ ఐటమ్ సాంగ్ కోసం ఫిల్మ్ సీటీలో ఓ భారీ సెట్ వేసేందుకు ‘RRR’ యూనిట్ సిద్ధమవుతోంది. ఈ స్పెషల్ సాంగ్ కు సంబంధించి ఇప్పటికే కీరవాణి మ్యూజిక్ కంపోజ్ పూర్తయిందని టాక్ విన్పిస్తుంది. ఈ ప్రత్యేక గీతంలో ఆడిపాడేందుకు టాలీవుడ్ భామ రకుల్ ప్రీత్ సింగ్ ను ‘RRR’ బృందం సంప్రదించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీలో మెగాపవర్ స్టార్ రాంచరణ్ అల్లూరి సీతరామరాజుగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ భామ అలియాభట్, హలీవుడ్ భామ ఒలివియా, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్, సీనియర్ హీరోయిన్ శ్రియ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ కూడా ‘RRR’లో చేరుతుండటంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.