
కొన్నేళ్ల పాటు టాలీవుడ్ ను ఓ ఊపు ఊపేసిన కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్. ‘కెరటం’ అనే చిన్న సినిమాతో తెలుగు తెరకు పరిచయమై.. ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’ అనే మరో చిన్న సినిమాతో బ్రేక్ సాధించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎక్స్ప్రెస్ స్పీడుతో దూసుకెళ్లింది. వరుసగా ఆఫర్లు సొంతం చేసుకుంటూ తెలుగులో నంబర్ వన్ రేసులో నిలిచింది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ తో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు, కింగ్ నాగార్జున సరసన నటించింది. విజయాలు కూడా ఆ స్థాయిలో ఉండడంతో ఆమెకు ఎదురే లేదనిపించింది. కానీ, తెలుగులో పీక్లో ఉన్న టైమ్ లో బాలీవుడ్ కు అడుగు పెట్టి చేతులు కాల్చుకుంది. అక్కడ పెద్దగా సక్సెస్ రాకపోగా.. కొంత గ్యాప్ రావడంతో టాలీవుడ్ లో అవకాశాలు తగ్గిపోయాయి. పైగా, మహేష్ తో ‘స్పైడర్’, నాగార్జునతో ‘మన్మధుడు2’ డిజాస్టర్స్ కావడంతో రకుల్ కెరీర్ తలకిందులైంది. లక్కీ హీరోయిన్ పేరు పోయి ఐరన్ లెగ్ ముద్ర పడింది. మరోవైపు బాలీవుడ్ లో అందాల ప్రదర్శన ఎంత చేసినా అవకాశాలు రాకపోవడంతో బ్రతుకు జీవుడా అంటూ మళ్లీ టాలీవుడ్ బాట పట్టింది రకుల్. అయితే, ఈ రెండు మూడేళ్లలో రాశీ ఖన్నా, రష్మిక మందన్నా, కీర్తి సురేశ్ హవా కొనసాగుతోంది కాబట్టి.. టాలీవుడ్ రీఎంట్రీలో తనకు ఎర్ర తివాచీ పరిచేందుకు ఎవరూ సిద్ధంగా లేరని రకుల్ ముందుగానే అర్థం చేసుకున్నట్టుంది. అందుకే ఏ అవకాశం వచ్చిన వదులుకోవద్దని నిర్ణయించింది. ఈ క్రమంలో మెగా ఫ్యామిలీ కొత్త హీరో వైష్ణవ్ తేజ్ సరసన హీరోయిన్గా చేసేందుకు ఆమె ఒప్పుకుంది.
Also Read: శ్రీరాముడు ప్రభాస్, సీత కీర్తి సురేషేనా..!
వైష్ణవ్ చేసిన ఒకే సినిమా ఇంకా రిలీజ్ కాకపోయినా అతనితో నటించేందుకు ఒప్పుకుందంటేనే రకుల్ ఎంత కరువులో ఉందొ అర్థం చేసుకోవచ్చు. అయితే, ఈ మూవీకి టాప్ ఫిల్మ్ మేకర్ క్రిష్ దర్శకత్వం వహించడం ఆమెకు ప్లస్ పాయింట్. క్రిష్ ఉన్నాడనే భరోసాతోనే ఆమె ముందడుగు వేసిందని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ తో చేయాల్సిన సినిమాను పక్కనబెట్టి మరీ క్రిష్ ఈ మూవీ చేస్తున్నాడు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో జరిగే థ్రిల్లింగ్ మూవీ రెగ్యూలర్ షూటింగ్ను ఈ మధ్యే హైదరాబాద్లో మొదలు పెట్టారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిన్న చిత్రాన్ని వీలైనంత తొందరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని యూనిట్ భావిస్తోంది. ఇక, ఈ మూవీలో రకుల్ పాత్రపై ఆసక్తికర విషయం తెలిసింది. ఇందులో రకుల్ డీ గ్లామర్ రోల్ పోషిస్తోందట. అంతేకాదు ఇందులో ఆమె ఓ రైతు కూలీగా కనిపిస్తుందని సమాచారం. రకుల్ కోసం క్రిష్ బలమైన క్యారెక్టర్ రాశాడట. చిత్రంలో అదే హైలైట్గా ఉంటుందని టాలీవుడ్ టాక్. అయితే, ఇన్నాళ్లూ గ్లామర్ పాత్రలకే పరిమితమైన రకుల్ తొలిసారి డీగ్లామర్ గా కనిపించడమే కొత్త అనుభూతి. అలాంటిది రైతు కూలీగా, పొలాల్లో పని చేసే మహిళగా రకుల్ ను ఊహించుకోవడమే గమ్మత్తుగా అనిపిస్తోంది. మరి, ఈ చాలెంజింగ్ క్యారెక్టర్లో ఆమె ఎలా నటిస్తుందో చూడాలి. మరో వైపు శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్లో వస్తున్న ఇండియన్ 2 లో కూడా రకుల్ కీలక పాత్ర పోషిస్తోంది.