SS Karthikeya: ఇప్పటివరకు రాజమౌళి సినిమాల్లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా మాత్రమే ఉన్న కార్తికేయ.. పూర్తిస్థాయి నిర్మాతగా మారారు. రాజమౌళికి అత్యంత ఆత్మీయులు, బాహుబలి నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని తో చేతులు కలిపారు. వీరిద్దరూ కలిసి మలయాళ నటుడు పహద్ పాజిల్ హీరోగా ఆక్సిజన్ అనే పేరుతో ఓ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా పోస్టర్లను దర్శకుడు రాజమౌళి.. సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల చేశారు. ఈ సందర్భంగా తన కొడుకు నిర్మాతగా పరిచయం అవుతుండడాన్ని ఉద్వేగంగా చెప్పారు.. “తన ప్రయాణాన్ని ప్రారంభించేందుకు ఏ నిర్మాతకైనా అద్భుతమైన స్క్రిప్ట్ కలిగి ఉండటం కల. నీకు రెండూ ఉన్నాయి. నీ ప్రయాణంలో ఇద్దరు గొప్ప భాగస్వాములు లభించారు. దృఢమైన శోభు గారు, ప్రసాద్ దేవినేని, ప్రతిభావంతమైన ఫహద్. వీరితోపాటు ఇద్దరు ప్రతిభావంతులైన శశాంక్, సిద్దు నీకు లభించారు. ఇంకా ఎక్కువ ఎత్తుకు ఎదగాలంటూ” రాజమౌళి రాసుకొచ్చారు.
ఫహద్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ ఆక్సిజన్ సినిమాను ఆర్కా మీడియా, షోయింగ్ బిజినెస్ పతాకాలపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్ ఎస్ కార్తికేయ నిర్మిస్తున్నారు. ఈ ప్రచార చిత్రం ఆకట్టుకునేలా ఉంది. ఒక చిత్రంలో ఫహద్ మాస్క్ ధరించి ఉన్నారు. ఆక్సిజన్ టైటిల్ కార్డులో ఇద్దరు వ్యక్తులు ఒకరి భుజం మీద మరొకరు చేయి వేసుకుంటూ నడుస్తున్నారు. మరొక ప్రచార చిత్రంలో ఫహద్ ఒక చిన్నారితో ఆడుకుంటున్నాడు. అంటే ఇది ఆక్సిజన్ ఇతివృత్తంతో ముడిపడి ఉన్న కథలాగా తెలుస్తోంది.
ఈ సినిమాకి నాదెళ్ళ సిద్ధార్థ దర్శకత్వం వహిస్తున్నారు. వేద వ్యాస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎడిటర్ గా దేవరమణి నిరంజన్, సంగీత దర్శకుడుగా కాలభైరవ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు సమర్పకుడిగా రాజమౌళి వ్యవహరిస్తున్నారు. తెలుగు, మలయాళం, కన్నడ, తమిళంలో ఈ సినిమా విడుదల కానుంది. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుందని మేకర్స్ ప్రకటించారు..