
నక్సలిజం, ఉద్యమాలు, ప్రభుత్వాల అసమర్థతపై విమర్శనాత్మకంగా సినిమాలు తీసే పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణ మూర్తి గురించి సంచలన విషయాలు బయటకు వచ్చాయి. తాజాగా ‘చైతన్య’ అనే చిత్రంతో నారాయణ మూర్తి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. గ్లోబలైజేషన్ లో రైతులు పడుతున్న అవస్థల గురించి తన కొత్త చిత్రంలో చూపించబోతున్నారు. ఈ సినిమా ప్రెస్ మీట్ కు తాజాగా ప్రజా యుద్ధనౌక గద్దర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన గద్దర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
గద్దర్ మాట్లాడుతూ ‘గత 8 నెలల నుంచి ఆర్.నారాయణ మూర్తి అనారోగ్యంతో బాధపడుతున్నారు. దాంతో నీవు ఎక్కడున్నావ్? ఏం చేస్తున్నావు? మా ఇంటికి రండి అని పిలుస్తా.. కానీ ఆయన రాడు. సొంత ఆస్తి అంటూ లేని వ్యక్తి నారాయణమూర్తి. సొంత ఇల్లు లేదు.. పెళ్లాం లేదు. సూటు లేదు. బూటూ లేదు. ఒక బండి లేదు. అలా రోడ్డుపైన నడుచుకుంటూ వెళ్తాడు. తెర మీద నటిస్తాడు.. కానీ జీవితంలో నటించడు అని ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడు.
నారాయణ మూర్తి ఆర్థికంగా చాలా కష్టాల్లో ఉన్నాడని.. ఇంటి కిరాయి కట్టలేక సిటీకి 50 కిలోమీటర్ల దూరంలో ఇల్లు కిరాయికి తీసుకొని ఉంటున్నాడని గద్దర్ తెలిపారు. ఇంతమంది స్నేహితులుంటే.. ఎక్కడికో వెళ్లడం ఎందుకు అని అడుగుతుంటాను అని ఆర్. నారాయణమూర్తి గురించి భావోద్వేగంతో చెప్పుకొచ్చాడు గద్దర్.
రైతులకు వ్యతిరేకంగా రూపొందించిన చట్టాలపై నారాయణమూర్తి ‘సినిమా’ను అస్త్రంగా రూపొందించుకొని వాస్తవాలను బయటపెడుతున్నారు. రైతులు ఎక్కడైనా తమ పంటను అమ్ముకోవచ్చని దగా చేస్తున్నారని.. ఇక్కడ పంటను ఢిల్లీలో అమ్ముకోవడం సాధ్యమా? అంటూ గద్దర్ ప్రశ్నించారు. కార్పొరేట్ సంస్థల దోపిడీని బట్టబయలు చేయడానికే సినిమాను ఆర్.నారాయణ మూర్తి మాధ్యమంగా ఎంచుకున్నారని తెలిపారు. ఈ సినిమాను ఆదరించాలని కోరారు.