Pushpa: భారీ అంచనాల మధ్య డిసెంబరు 17న విడుదలైన పుష్ప. అంతే జోరుతో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఈ సినిమా తెరకెక్కింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ కథ ప్రేక్షకులను ఎంతగానే ఆకట్టుకుంది. ఒక్క తెలుగులోనే కాకుండా, అన్ని భాషల్లోనూ సినిమా మంచి హిట్ టాక్ అందుకుంది. విడుదలైన రెండో రోజే 100 కోట్ల క్లబ్లో చేరి రికార్డులు నెలకొల్పింది.

మూడు రోజుల్లోనే రూ.173 కోట్లు వసూళ్లు చేసింది. ఈ క్రమంలోనే పుష్ప టీమ్ వరుసగా సక్సెస్ మీట్లను ప్లాన్ చేసుకుంది. తాజాగా, శుక్రవారం కాకినాడలో సక్సెస్ మీట్‌కు సన్నాహాలు చేసుకోగా.. ఏపీ ప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోనడంతో మీట్‌ను రద్దు చేయాల్సి వచ్చింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ట్విట్టర్ వేదికగా తెలియజేసింది. ప్రస్తుతం టాలీవుడ్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం అన్నట్లు నడుస్తోంది. ఓ వైపు ఏపీ సర్కారు సినిమా టికెట్ల ధర తగ్గించిన నేపథ్యంలో సినీ పరిశ్రమ అసహనం వ్యక్తం చేస్తోంది.
ఈ క్రమంలోనే కోర్టు మెట్లు కూడా ఎక్కింది. ధర్మాసం కూడా సినీ పరిశ్రమకు మద్దతుగా జీఓను రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే, జగన్ సర్కారు మాత్రం ఎవ్వరి మాట వినట్లేదు.. ఈ క్రమంలోనే తనిఖీల పేరుతో ఏపీలో పలు థియేటర్లను మూసేయించింది. సరైన సౌకర్యాలు లేవంటూ ఇప్పటికే చాలా థియేటర్లను మూసేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రభావమే పుష్ప ఈవెంట్‌పై పడినట్లు పలువురు చెప్పుకుంటున్నారు.