Sandhya Theatre : హైదరాబాద్ లో మాస్ ఆడియన్స్ సింగల్ స్క్రీన్స్ లో మొదటిరోజు మొదటి ఆట చూడాలని కోరుకునే సెంటర్స్ లో ఒకటి ఆర్టీసీ క్రాస్ రోడ్స్. ఈ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సంధ్య థియేటర్ కి ఉన్న క్రేజ్ మామూలుది కాదు. ఇందులో స్టార్ హీరోల సినిమాలు మొదటి రోజు మొదటి ఆటని చూసేయాలి అనే తపన ఉంటుంది ఆడియన్స్ లో. అలాంటి సందర్భంలోనే గత నెలలో పుష్ప 2 ప్రీమియర్ షో సమయంలో తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన ఎంతటి దుమారం రేపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడంతో ఆయన పేరుతో పాటు, థియేటర్ పేరు కూడా ఒక నెల రోజులపాటు మారుమోగింది. ఒకానొక దశలో ఈ థియేటర్ కి లైసెన్స్ ని రద్దు చేస్తారేమో అని అనుకున్నారు. కానీ అంత దూరం వెళ్ళలేదు. అయితే ఈ థియేటర్ లో ఇప్పటికీ పుష్ప 2 చిత్రం విజయవంతంగా నడుస్తుంది.
రీసెంట్ గానే 20 నిమిషాల అదనపు సన్నివేశాలను జత చేసి ‘పుష్ప 2 – రీ లోడెడ్’ వెర్షన్ అంటూ మేకర్స్ పెద్ద ఎత్తున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. దీనికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. గత వీకెండ్ లో సంధ్య థియేటర్ హౌస్ ఫుల్స్ ని కూడా నమోదు చేసుకొని సంచలనం సృష్టించింది. అయితే త్వరలోనే ఈ చిత్రం ఈ థియేటర్ లో అరుదైన రికార్డు ని నెలకొల్పబోతుంది. ఇప్పటి వరకు ఈ సినిమాకి దాదాపుగా కోటి 90 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. 2001 వ సంవత్సరం లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి చిత్రానికి ఇక్కడ కోటి 58 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. పుష్ప 2 చిత్రానికి ముందు ఎన్నో పాన్ ఇండియన్ సినిమాలు ఈ థియేటర్ లో విడుదలై సంచలన విజయాలుగా నమోదు చేసుకున్నాయి.
కానీ ఒక్క సినిమా కూడా ఖుషి రికార్డు దరిదాపుల్లోకి వెళ్లలేకపోయింది. కానీ పుష్ప 2 చిత్రం ఖుషి రికార్డు ని బద్దలు కొట్టడమే కాకుండా, మరో 50 లక్షల రూపాయిల గ్రాస్ ని అదనంగా రాబట్టి సంచలనం సృష్టించింది. ప్రస్తుతానికి కోటి 90 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా అతి త్వరలోనే రెండు కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకోనుంది. ఈ రికార్డు ని అందుకోవడం అంత తేలికైన విషయం కాదు. కేవలం పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’, ‘ఓజీ’ చిత్రాలకు మాత్రమే ఈ రికార్డుని బద్దలు కొట్టే అవకాశాలు ఉన్నాయి. మరి ఎంత వరకు ఆ సినిమాలు ఈ చిత్రాన్ని రీచ్ అవుతాయో చూడాలి. ఎందుకంటే సంధ్య కాంప్లెక్స్ పవన్ కళ్యాణ్ అభిమానుల అడ్డా. వాళ్ళు ఈ థియేటర్ ని మా ‘వైకుంఠం’ అని అంటుంటారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ నటించిన ఎన్నో సినిమాలు ఆల్ టైం రికార్డ్స్ ని నెలకొల్పాయి.