Puneeth Raj kumar: కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు ముగిశాయి. బెంగళూరులోని కంఠీరవ స్టూడియోలో పునీత్ అంత్యక్రియలను నిర్వహించారు. ఆయన తల్లిదండ్రుల సమాధి దగ్గరే పునీత్‌కు అంత్యక్రియలు చేశారు. కుటుంబీకులు, ముఖ్య నటులు, ప్రభుత్వ పెద్దల మధ్య పునీత్ రాజ్ కుమార్ ఖననం జరిగింది. కంఠీరవ స్టేడియంలో 36 గంటలకు పైగా పునీత్ భౌతికకాయం సందర్శన కొనసాగగా… ఇవాళ తెల్లవారుజాము వరకు అభిమానుల తాకిడి కొనసాగింది. పునీత్ రాజ్ కుమార్ భౌతికకాయం సందర్శన కోసం… రికార్డు స్థాయిలో 10 లక్షల మంది స్టేడియంకు వచ్చినట్లు అంచనా వేస్తున్నారు అధికారులు.
పునీత్ రాజ్ 1999లో డిసెంబర్ 1న చిక్కమగళూరుకు చెందిన అశ్విని రేవంత్‌ని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ధృతి, వందిత పునీత్ రాజ్. అయితే పునీత్ కు అంత్యక్రియలు చేయడానికి కొడుకు లేకపోవడంతో… అతని అన్న రాఘవేంద్ర రాజ్ కుమార్ కొడుకు వినయ్ రాజ్ కుమార్‌తో అంత్యక్రియలు చేయడానికి కుటుంబ సభ్యులు అందరూ నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. కంఠీరవ స్టేడియం నుంచి కంఠీరవ స్టూడియో వరకు నిరాడంబరంగా పునీత్ రాజ్ కుమార్ అంతిమ యాత్ర కొనసాగింది.
కంఠీరవ రాజ్‌కుమార్‌కు మొత్తం ముగ్గురు కుమారులు ఉన్నారు. వారిలో పునీత్ చిన్నవాడు. శివరాజ్ కుమార్ పెద్దకొడుకు కాగా, రాఘవేంద్ర రెండోవాడు. ఆయన కుమారుడే వినయ్ రాజ్‌కుమార్. అతని చేతుల మీదుగా పునీత్‌కు అంత్యక్రియలు జరిపించారు. వినయ్ హీరోగా ఎదగడానికి కూడా పునీత్ ఎంతో సహాయపడ్డారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పునీత్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.