Prakash Raj : ప్రకాష్ రాజ్ కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్. సుదీర్ఘ కెరీర్లో పలు వివాదాలు ఆయన్ని చుట్టుముట్టాయి. ఒకటి రెండు సార్లు చిత్ర పరిశ్రమల బహిష్కరణకు గురయ్యాడు. అయితే ఆయన ముక్కుసూటితనమే వీటన్నిటికీ కారణమన్న వాదన ఉంది. తాజాగా ప్రకాష్ రాజ్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా మంది నటులు నాతో నటించడానికి భయపడుతున్నారని అన్నారు. ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ… ప్రస్తుతం నాపై రాజకీయ ప్రభావం ఎక్కువగా ఉంది. చాలా మంది నటులు నాతో నటించాడనికి భయపడుతున్నారు. నాతో సినిమాల్లో కనిపిస్తే ఒక వర్గం ప్రేక్షకులు అంగీకరించరేమో అని సంకోచిస్తున్నారు.

దానికి నేను బాధపడటం లేదు. అలాంటి వాళ్లు నాకు దూరమైతేనే మంచిదని ప్రకాష్ రాజ్ వెల్లడించారు. నేను ఈ విషయంలో కొంచెం కూడా బాధపడటం లేదు. కొన్ని విషయాలకు నేను వ్యతిరేకంగా మాట్లాడాలి. లేదంటే కేవలం మంచి నటుడిగానే నేను చనిపోతాను. నాకు అలా చనిపోవాలని లేదని ప్రకాష్ రాజ్ తన ఉద్దేశం తెలియజేశారు. ప్రకాష్ రాజ్ చాలా కాలంగా బీజేపీ ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్నారు. ప్రధాని మోడీ విధివిధానాలను ప్రకాష్ రాజ్ వ్యతిరేకిస్తూ ఉంటారు. సోషల్ మీడియా వేదికగా తన గళం విప్పుతారు.
ఇదే ఆయన కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపుతుందని ప్రకాష్ రాజ్ చెప్పారు. అన్నిటికీ సిద్ధంగా ఉన్న నేను మోడీని ప్రశ్నించడం ఆపను అని స్పష్టంగా చెప్పారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బెంగుళూరు సెంట్రల్ నుండి ప్రకాష్ రాజ్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. సోషల్ మీడియా వేదికగా మోడీపై తన పోరాటం సాగిస్తున్నారు. మోడీ ప్రభుత్వంలోని ప్రతి చిన్న లోపాన్ని ప్రకాష్ రాజ్ ఎత్తి చూపుతారు. గట్టిగా ప్రశ్నించే ప్రయత్నం చేస్తారు. పలు డిబేట్లలో పాల్గొని బీజేపీకి వ్యతిరేకంగా తన గళం వినిపించారు.
కాగా 2021 అక్టోబర్ లో జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ అధ్యక్షుడిగా పోటీ చేసి ఓడిపోయారు. మంచు విష్ణు ఈ ఎన్నికల్లో గెలిచి అధ్యక్షుడు అయ్యారు. సార్వత్రిక ఎన్నికలను తలపించిన మా ఎలక్షన్స్ ఇరు వర్గాల మధ్య విమర్శల దాడికి తెరలేపింది. ప్రకాష్ రాజ్ కి నాగబాబుతో పాటు మెగా ఫ్యామిలీ మద్దతు తెలిపారు. ఓటమి తర్వాత ప్రకాష్ రాజ్ ఎన్నికల నిర్వహణపై అసహనం వ్యక్తం చేశారు. అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ప్రకాష్ రాజ్ ప్యానల్ తరపున గెలిచిన శ్రీకాంత్, బెనర్జీతో పాటు మరికొందరు రాజీనామా చేశారు.