Prakash Raj Resigns : ‘మా’ ఎన్నికలు ముగిశాయి, సభ్యుల మధ్య మాటల యుద్ధం ముగిసింది, ఆరోణలు, అవమానాల గోల తగ్గింది. మొత్తానికి ఉత్కంఠగా సాగిన ఈ ఎన్నికల్లో మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ పై ఘన విజయాన్ని సాధించాడు. లెక్కకు మించిన మేనిఫెస్టోలు, హామీలు ఇచ్చి ప్రకాష్ రాజ్ ను, అతనికి సపోర్ట్ చేసిన మెగా ఫ్యామిలీని చిత్తుగా ఓడించాడు.

దాంతో కలత చెందిన ప్రకాష్ రాజ్, నాగబాబు ‘మా’ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. ‘మా ఎన్నికలు బాగా జరిగాయి. ఈ సారి గతంలో ఎప్పుడూ లేనంత చైతన్యంతో దాదాపు 650మంది వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంచు విష్ణు, శివబాలాజీ రఘుబాబుతో సహా గెలిచిన వారందరికీ పేరు పేరునా శుభాకాంక్షలు. మీరు అతి పెద్ద ప్రణాళికతో వచ్చారు. మీరిచ్చిన హామీలు నెరవేర్చండి’ అని చెప్పుకొచ్చారు.
అనంతరం ప్రకాష్ రాజ్ ఎమోషనల్ గా మాట్లాడుతూ.. ‘నిజమే, ఈ రోజు నేను తెలుగువాడిని కాదు, ‘తెలుగు వ్యక్తి కాని వాడు ఓటు వేయవచ్చు. కానీ ఎన్నికల్లో పోటీ చేయకూడదు’ అనే నినాదాన్ని ప్రారంభించారు. నా తల్లిదండ్రులు తెలుగువారు కాకపోవడం నా తప్పు, వాళ్ల తప్పు కూడా కాదు. అసోసియేషన్ కు ఒక నాయకత్వం వహించిన మీకు, తెలుగువాడు మాత్రమే ఉండాలన్నారు. దాన్ని మెంబర్స్ ఆమోదించారు. తెలుగు బిడ్డ, మంచి వ్యక్తిని ఎన్నుకున్నారు. దాన్ని నేను స్వాగతిస్తున్నాను’ అని ప్రకాష్ రాజ్ చెప్పడం అందర్నీ కదిలించింది.
ఇక తన రాజీనామా గురించి మాట్లాడుతూ.. ‘ప్రాంతీయత, జాతీయవాదం వీటి నేపథ్యంలో మా ఎన్నికలు జరిగాయి. ఒక కళాకారుడిగా నాకంటూ ఆత్మగౌరవం ఉంటుంది కదా. అందుకే ‘మా’ ప్రాథమిక సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తున్నాను. ఇది బాధతో తీసుకున్న నిర్ణయం కాదు. ప్రేక్షకులకు నాకూ ఉన్న బంధం సినిమాలతో కొనసాగుతుంది. పెద్ద నటులు మోహన్ బాబుగారు, కోటగారు, చలపతిరావు తనయుడు రవి వీళ్లంతా ‘అతిథిగా వస్తే, అతిథిగానే ఉండాలి’ అని చెప్పారు కదా. నేను అలాగే ఉంటాను. నా ఓటమి పై భాజపా నేత బండి సంజయ్ లాంటి వాళ్లు కూడా ట్వీట్ చేశారు. జీవితం ఎంతో అందమైనది’’ అని ప్రకాశ్‌రాజ్ తెలియజేశారు.
నాగబాబు కూడా మా సభ్యత్వానికి రాజీనామా చేశారు. ’ ప్రాంతీయ వాదం మరియు సంకుచిత మనస్తత్వం తో కొట్టు-మిట్టులాడుతున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో కొనసాగడం నాకు ఇష్టం లేక “మా” అసోసియేషన్లో “నా” ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను… సెలవు. అంటూ నాగబాబు పోస్ట్ చేశాడు.