prakash raj: ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ వారం రోజుల పాటు మౌనవ్రతం చేయబోతున్నారు. ఆయన ఎవరిమీదో నిరసనతో ఈ వ్రతం చేయట్లేదండోయ్.. ఇటీవల కాలంతో అనారోగ్యానికి గురైన ప్రకాశ్‌రాజ్.. ఎందుకైనా మంచిదని ఆసుపత్రికి వళ్లి బాడీ చెక్అప్ చేయించుకున్నారట. అయితే, ఆరోగ్యం అంతా బాగుందని.. ఒక్క ఓకల్ కార్డ్స్ మాత్రం కాస్త దెబ్బతిన్నాయని.. వారం పాటు పూర్తి స్థాయిలో విశ్రాంతి ఇస్తే అదే నయమవుతుందని వైద్యులు సూచించారు. దీంతో మౌనవ్రతానికి పూనుకున్నారు ప్రకాశ్‌రాజ్. ఈ విషయాన్ని ప్రకాశ్ రాజ్ ట్విట్టర్ వేదికగా స్వయంగా తెలియజేశారు.
Had a complete check up with the doctors.. I’m rocking .. only my vocal chords need complete rest for a week. So “Mouna vratha “ .. will bask in silence..Bliss
— Prakash Raj (@prakashraaj) November 15, 2021
ప్రతి విషయంలో సూటిగా తన అభిప్రాయాన్ని తెలయజేస్తుంటారు ప్రకాశ్ రాజ్.. అలాంటి వ్యక్తి ఇప్పుడు మౌన వ్రతం చేయడం విశేషాన్ని సంతరించుకుంది. అయితే, ఆయన మౌనం కొంతమందికి వరంగా మారుతుందని సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు. దీంతో పాటు, ఆయన ఆరోగ్యం కూడా త్వరగా మెరుగవుతుందని అంటున్నారు. ఇటీవల అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైన జై భీమ్ సినిమాలో ప్రకాశ్‌రాజ్ నటించిన సంగతి తెలిసిందే. అయితే, తన పాత్రకు ఎప్పుడూ ఆయనే డబ్బింగ్ చెప్పుకునే వారు. కానీ, ఈ సినిమాలో వేరొకరి వాయిస్ వినిపించింది. ఈ క్రమంలోనే ఆ సినిమా షూటింగ్ సమయం నుంచే ఆయనకు ఈ సమస్య ఎదురైనట్లు తెలుస్తోంది.
కాగా, ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి ఎంతో మంది ప్రశంసలతో పాటు, విమర్శలూ ఎదుర్కొంటోంది. ఈ సినిమాలో కొన్ని సీన్లు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ పలు కేసులు కూడా నమోదయ్యాయి. కాగా, మరోవైపు వాస్తవ ఘటనలను కళ్లకు కట్టినట్లు చూపించారని.. పలువురు సెలబ్రిటీలతో పాటు, రాజకీయ నాయకులూ ప్రశంసించారు. ఇప్పటికీ ఈ సినిమా వివాదం కొనసాగుతూనే ఉంది.