‘పాన్ ఇండియా ఇమేజ్’.. ఇప్పుడు స్టార్లు అందరికీ ఇష్టమైన పదం ఇది. ‘పాన్ ఇండియా స్టార్’ అనిపించుకోవాలని ప్రతి హీరో, ప్రతి హీరోయిన్ తెగ ఉత్సాహ పడుతున్నారు. కానీ, స్టార్ డమ్ ఉన్నంత మాత్రాన, పాన్ ఇండియా ఇమేజ్ అందరికీ రాదు. అలాంటి ఇమేజ్ వచ్చింది అంటే వాళ్ళు అదృష్టవంతులు కింద లెక్కే. ఆ అదృష్టవంతుల్లో తను కూడా ఉన్నానని తనకు తానే చాటి చెప్పుకుంటుంది టాల్ అండ్ క్రేజీ బ్యూటీ ‘పూజా హెగ్డే’.
ఈ భామకి ఎప్పటి నుండో ఒక కోరిక ఉందట, తానూ పాన్ ఇండియా హీరోయిన్ అవ్వాలని. ఇప్పుడు తన కోరిక నెరవేరిందని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సగర్వంగా తెలియజేసింది. పూజా ఖాతాలో ‘అరవింద సమేత, మహర్షి’ ‘గద్దలకొండ గణేష్’, లాంటి విజయాలతో పాటు ‘అల వైకుంఠపురంలో’ లాంటి భారీ విజయం ఉంది. ఇవన్నీ తెలుగు సినిమాలు. మరి తెలుగు సినిమాల్లో నటించి ‘పాన్ ఇండియా హీరోయిన్’ ఎప్పుడు అయిందో అమ్మడు మాటల్లోనే విందాం.
పూజా మాట్లాడుతూ ‘బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ తో ‘మొహంజదారో’ సినిమా చేసిన సమయంలో నేను చాలా కలలు కన్నాను. ఆ సినిమాతో నేను పాన్ ఇండియా హీరోయిన్ అవుతాను అనుకున్నాను. కానీ ఆ సినిమా పెద్దగా ఆడకపోయే సరికి, అప్పట్లో నా కెరీర్ గ్రాఫ్ తగ్గింది. అయితే, ఆ తర్వాత కొన్ని సక్సెస్ లతో నేను మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం నాకు రాలేదు.
దీనికితోడు బాలీవుడ్ లో కూడా నాకు మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇక తెలుగులో నంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగుతున్నాను. అలాగే తమిళంలో కూడా సినిమాలు చేస్తున్నాను. కాబట్టి, పాన్ ఇండియా యాక్టర్ అవ్వాలనే నా చిరకాల కోరిక, ఇప్పుడు నిజమైందనుకుంటున్నాను’ అంటూ పూజా హెగ్డే చెప్పుకొచ్చింది. ఇక చివర్లో పూజా ప్లాప్ ల గురించి కూడా చిన్నపాటి స్పీచ్ ఇచ్చింది.
ఫ్లాప్ హీరోయిన్ తో సినిమా చేయాలని ఎవ్వరూ భావించరు. అప్పట్లో నేను కూడా ఆ ప్లాప్ దశను చూశాను. అయితే, ప్లాప్ హిట్ అనేవి మన చేతిలో ఏమి ఉండవు. మనం ప్రతి సినిమా ఆడుతుందనే చేస్తాం కదా. కానీ, కొన్ని సినిమాలు మాత్రమే హిట్ అవుతాయి అంటూ ఈ డస్కీ బ్యూటీ ముగించింది.