
టాలీవుడ్లో వరుస సినిమాలతో దూసుకెళ్తున్న బుట్టబొమ్మ పూజా హెగ్డే నిన్న ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి కొన్ని మీమ్స్‌ను షేర్ చేసింది. అందులో ఓ మీమ్ సమంత నటించిన మజిలీ సినిమాలోని సీన్. దానిపై ‘ఆమె నాకు అంత అందంగా కనిపించడం లేదు’ అనే కామెంట్ చేసింది. అంతే, సమంతను పూజా ఎందుకింత మాట అన్నది? అని అభిమానులు ఆశ్చర్యపోయారు. నాగ చైతన్యతో పాటు అఖిల్‌తో నటించిన పూజ.. అక్కినేని కోడలిని అందంగా లేదంటుందా? అని కొందరు గుస్సా అయ్యారు. కానీ, అసలు విషయం తెలిసి పాపం పూజ అనుకున్నారు. ఎందుకంటే ఈ మీమ్, కామెంట్ పోస్ట్ చేసింది మన బుట్టబొమ్మ కాదు. హ్యాకర్లు. అవును. పూజా హెగ్డే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బుధవారం రాత్రి హ్యాక్ అయింది. అప్పటి నుంచి హ్యాకర్లు ఆమె అకౌంట్ నుంచి కొన్ని పోస్టులు పెట్టారు.
తన ఇన్ స్టా అకౌంట్ హ్యాక్ అయిందనే విషయాన్ని ట్విట్టర్ ద్వారా పూజ తెలిపింది. ‘హాయ్ గాయ్స్. నా ఇన్ స్టా అకౌంట్ హ్యాక్ అయిందని నా టీమ్ ద్వారా తెలుసుకున్నా. దీని కోసం నా డిజిటల్ టీమ్ నాకు సాయం చేస్తోంది. నా అకౌంట్ నుంచి ఎలాంటి ఇన్విటేషన్స్ వచ్చినా యాక్సెప్ట్ చేయకండి. ఎవరైనా మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడిగితే ఇవ్వకండి. థ్యాంక్యూ’ అని పూజ ట్వీట్ చేసింది. కొన్ని గంటల తర్వాత టెక్నికల్ టీమ్ సాయంతో ఆమె తిరిగి తన అకౌంట్ తన చేతుల్లోకి తిరిగి వచ్చినట్లు పేర్కొంది. మరో ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని పూజా ఫ్యాన్స్‌కు చెప్పింది. ‘నా ఇన్ స్టా అకౌంట్ భద్రత గురించి చాలా సేపు ఒత్తిడిని ఎదుర్కొన్నా. ఇందులో నుంచి బయటపడేందుకు సాయం చేసిన నా టెక్నికల్ టీమ్ కు థ్యాంక్స్. మొత్తానికి ఇన్ స్టా అకౌంట్ ను తిరిగి పొందాను’ అని ట్వీట్ చేసింది. హ్యాక్ అయిన సమయంలో తన అకౌంట్ నుంచి వచ్చిన మెసేజ్‌లు, పోస్టులను తొలగిస్తామని చెప్పింది.
‘అల వైకుంఠపురములో’ సినిమాతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్న పూజ లాక్డౌన్ నేపథ్యంలో ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లోనే ఉంటోంది. అఖిల్ అక్కినేనితో కలిసి నటించిన ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ సినిమా విడుదల కావాల్సి ఉంది. అదే విధంగా రాధాకృష్ణ డైరెక్షన్ లో ప్రభాస్ సరసన కూడా ఓ చిత్రంలో నటిస్తోంది. లాక్డౌన్ ముగిసిన తర్వాత ఈ సినిమా షూటింగ్ తిరిగి మొదలుకానుంది.