Bigg Boss 9 Telugu Police Case: స్టార్ మా ఛానల్ లో ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9 Telugu) మంచి టీఆర్ఫీ రేటింగ్స్ తో ముందుకు దూసుకుపోతోంది. ఆసక్తికరమైన టాస్కులతో, మంచి ఎంటర్టైన్మెంట్ తో సాగుతున్న ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఇప్పుడు చిక్కుల్లో పడింది. తెలంగాణ ప్రాంతం లోని గజ్వేల్ కి చెందిన శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, సుకుమార్ రెడ్డి, చంద్ర శేఖర్, శ్రీనివాస్ తదితరులు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బిగ్ బాస్ షో సమాజాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఉందని, ఈ షో లో కంటెస్టెంట్స్ గా ఉన్న వారిలో కొంతమంది సమాజం లో అసలు విలువ లేదని, కుటుంబ విలువలు ఏ మాత్రం పాటించని రీతూ చౌదరి, దివ్వెల మాధురి మరియు రమ్య మోక్ష వంటి వారిని ఈ షోకి ఎంపిక చేసి సమాజానికి ఎలాంటి సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారో అర్థం కావడం లేదని ఫిర్యాదు లో పేర్కొన్నారు.
సమాజం సిగ్గు పడే విధంగా బిగ్ బాస్ షో ని నిర్వాహకులు నిర్వహిస్తున్నారని, నాగార్జున లాంటి సూపర్ స్టార్ ఇలాంటి షో కి హోస్ట్ గా వ్యవహరించడం దురదృష్టకరమని, తక్షణమే బిగ్ బాస్ షోను నిలిపివేయాలని, ప్రభుత్వం ఇలాంటి రియాలిటీ షోస్ పై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ,లేకపోతే బిగ్ బాస్ హౌస్ ని ప్రజా సంఘాలు, మహిళా సంఘాలతో కలిసి ముట్టడిస్తాము అంటూ హెచ్చరికలు జారీ చేస్తూ ఈ ఫిర్యాదు లో పేర్కొన్నారు. కన్నడ లో ఎలా అయితే బిగ్ బాస్ షో ని మధ్యలోనే నిలిపివేశారో, మన తెలుగు లో కూడా అలాగే చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు. ఈ షో పై గతం లో CPI పార్టీ కి చెందిన నారాయణ వంటి వారు కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి, తక్షణమే షోని ఆపేయాలంటూ డిమాండ్ చేశారు.
కానీ బిగ్ బాస్ అనేది కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ షో మాత్రమే, ఈ షో కారణంగా ఇప్పటి వరకు సమాజం లోని మనుషులు చెడిపోయినట్టు కానీ, లేదా వాళ్లపై తీవ్రమైన ప్రభావం చూపినట్టు కానీ జరగలేదు. షో నడిచేంత వరకు ఆడియన్స్ చూస్తారు, కొన్నాళ్ళు అయిపోయాక కంటెస్టెంట్స్ పేర్లు కూడా గుర్తుండవు. అలాంటి షోని బ్యాన్ చేస్తే కలిగే లాభాలు ఏమి ఉండవు. కన్నడ బిగ్ బాస్ ని బ్యాన్ చేయడానికి కారణం, పర్యావరణం కంట్రోల్ నిబంధనలు సరిగా పాటించకపోవడం వల్లే. తెలుగు లో అలాంటి సమస్యలు ఏమి లేవు, కాబట్టి ఇలాంటోళ్ళు ఎన్ని విధాలుగా రాద్ధాంతం చేసినా, బిగ్ బాస్ షో ని ఆపలేరు అంటూ సోషల్ మీడియా లో బిగ్ బాస్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ కేసు వ్యవహారం ముందుకు వెళ్తుందా?, లేదంటే ఇక్కడితో ఆగిపోతుందా అనేది చూడాలి.