NTR Fans : అభిమానమైనా ప్రేమైనా హద్దులు దాటనంత వరకూ ఓకే, శృతి మించితేనే సమస్య. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు చేసిన పని వివాదాస్పదమైంది. కొన్ని చట్టాలను ఉల్లగించిన నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేశారు. మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. వరల్డ్ వైడ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అభిమానుల కోసం సింహాద్రి ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. పలు థియేటర్స్ లో రీరీలీజ్ చేయడం జరిగింది. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో గల రెండు థియేటర్స్ లో సింహాద్రి విడుదల చేశారు.
ఈ థియేటర్స్ వద్ద ఎన్టీఆర్ అభిమానులు హంగామా చేశారు. వేటపోతులను బలిచ్చి ఆ రక్తంతో ఎన్టీఆర్ ఫోటోకి అభిషేకం చేశారు. తాగిన మైకంలో మారణాయుధాలతో హల్చల్ చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోలపై వ్యతిరేకత వ్యక్తమైంది. పోలీసులకు ఫిర్యాదు అందించిన నేపథ్యంలో రంగంలోకి దిగారు, వీడియోల ఆధారంగా కొందరిని గుర్తించారు. మొత్తం తొమ్మిది మంది ఎన్టీఆర్ అభిమానులను పోలీసులు అరెస్ట్ చేశారు.
వారిపై పలు సెక్షన్స్ క్రింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ఇతర ఫ్యాన్స్ ముందు మెప్పు కోసం, ఆర్భాటం కోసం అనుచిత చర్యలకు పాల్పడితే పరిణామాలు ఇలానే ఉంటాయి. ఎంత అభిమానం ఉన్నా అది అదుపులో పెట్టుకోవాలి. లేదంటే తిప్పలు తప్పవు. స్టార్ హీరోల ఫ్యాన్స్ తరచుగా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. పబ్లిక్ ని తమ చర్యలతో భయపెడుతున్నారు.
మరోవైపు ఎన్టీఆర్ బర్త్ డే గిఫ్ట్ గా ఫ్యాన్స్ కి దేవర ఫస్ట్ లుక్ విడుదల చేశారు. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న దేవరలో ఎన్టీఆర్ ఊరమాస్ గెటప్ కాకరేపింది. నల్ల పంచె, చొక్కా ధరించి చేతిలో ఆయుధంతో ఎన్టీఆర్ సరికొత్తగా దర్శనమిచ్చాడు. దేవరలో ఎన్టీఆర్ చెలరేగిపోవడం ఖాయమని ఆ లుక్ చూస్తే అర్థం అవుతుంది. దేవర 2024 ఏప్రిల్ 5న విడుదల కానుంది. జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా, సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ చేస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.