Poacher web series review : మన చుట్టూ ఉండే పర్యావరణం బాగుంటేనే.. మనమూ బాగుంటాం. పీల్చే గాలి కలుషితమైతే ఎలా ఉంటుందో ఢిల్లీ వాసులను చూస్తే తెలుస్తుంది. తాగే నీరు కలుషితమైతే ఎలా ఉంటుందో ఫ్యాక్టరీలకు దగ్గరగా ఉండే వారి బతుకులు చూస్తే అవగతం అవుతుంది. తినే తిండి విషతుల్యమైతే ఎలాంటి పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందో కర్మాగారాలకు సమీపంలో జీవించేవారిని చూస్తే అర్థమవుతుంది. స్థూలంగా చెప్పాలంటే అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని నాశనం చేయడంతో పాటు.. దానివల్ల మనం కూడా నాశనమవుతున్నాం. ఒక మనిషిని ఇబ్బంది పెడితేనో.. లేక ఇంకేదైనా చట్టవిరుద్ధమైన కార్యక్రమానికి పాల్పడితేనో నేరం చేసినట్టు కాదు.. ప్రకృతికి చిన్నపాటి హాని తలపెట్టినా అది కూడా ఒక నేరమే. ఇలాంటి ప్రశ్నలు సంధించింది పోచర్ అనే ఓ వెబ్ సిరీస్. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే..
పోచర్ వెబ్ సిరీస్ యదార్ధ సంఘటనల ఆధారంగా రూపొందించారు. కేరళ రాష్ట్రంలో 2015 లో ఏనుగు దంతాల స్మగ్లింగ్ వెలుగులోకి వచ్చింది. అది అప్పట్లో ఆ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ ఏనుగు దంతాల స్మగ్లింగ్ చుట్టూ అల్లుకున్న కథే ఈ పోచర్ వెబ్ సిరీస్. బాలీవుడ్ సుప్రసిద్ధ నటి ఆలియా భట్ ఈ వెబ్ సిరీస్ నిర్మాతల్లో ఒకరు. 8 ఎపిసోడ్ల సమాహారంగా ఈ వెబ్ సిరీస్ నిర్మితమైంది.
కేరళ రాష్ట్రంలో 2015 జూలై నెలలో వెలుగులోకి ఏనుగు దంతాల స్మగ్లింగ్ ఉదంతం కలకలం రేపింది. అసలు ఈ దంతాల స్మగ్లింగ్ ఎవరు చేస్తున్నారు? ప్రభుత్వం దీనిని పూర్తిగా నిషేధించామని చెప్పినప్పటికీ.. ఎవరు చేస్తున్నారు? ఏనుగు దంతాల స్మగ్లింగ్ మార్కెట్ విలువ ఎంత? ఇలా అనేక విషయాలను ఈ వెబ్ సిరీస్ లో చూపించాడు దర్శకుడు రిచీ మెహతా. ఈ వెబ్ సిరీస్ లో కేరళ అడవుల్లోని అద్భుతమైన అందాలను కళ్ళకు కట్టినట్టు చూపించాడు. ఏనుగు దంతాల స్మగ్లింగ్ కు చెక్ పెట్టేందుకు 2015లో జరిగిన ఆపరేషన్ శిఖర్ ఆధారంగా ఈ వెబ్ సిరీస్ నిర్మించారు.
ఈ వెబ్ సిరీస్ కోసం దట్టమైన అడవుల్లో షూటింగ్ చేయడం దర్శకుడు పనితనానికి ప్రతీక. వెబ్ సిరీస్ ప్రారంభ ఎపిసోడ్లోనే నేరుగా దర్శకుడు కథలోకి తీసుకెళ్తాడు. దక్షిణ కేరళ రాష్ట్రంలో గుట్టుచప్పుడు కాకుండా అడవుల్లో ఏనుగుల వేట కొనసాగుతూ ఉంటుంది. ఆ ఏనుగుల దంతాలను కొంతమంది స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. 2015 నుంచి 2017 వరకు ఈ స్మగ్లింగ్ అనేది దర్జాగా సాగింది. అయితే ఈ స్మగ్లింగ్ ను అడ్డుకునేందుకు అటవీశాఖ అధికారులు, పోలీసులు పడిన శ్రమ ఈ వెబ్ సిరీస్ లో కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఏనుగులను ఎలా చంపుతారు? వాటి దంతాలను ఎలా పెకిలిస్తారు? ఆ దంతాలను ఎలా స్మగ్లింగ్ చేస్తారు? వంటి సన్నివేశాలను దర్శకుడు కళ్ళకు కట్టినట్టు చూపించాడు.
వెబ్ సిరీస్ ఆద్యంతం గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో కొనసాగుతుంది.. స్క్రీన్ పై పాత్రలను దర్శకుడు ప్రజెంట్ చేసిన విధానం కొత్తగా అనిపిస్తుంది. ఇదే సమయంలో పర్యావరణం మనకు ఎన్నో ప్రశ్నలు సంధిస్తుంది. అభివృద్ధి పేరుతో ఎలాంటి వినాశనాన్ని మనం కోరుకుంటున్నామో.. మనం మాత్రమే కాకుండా మన చుట్టూ ఉండే జంతువులకు ఎలాంటి హాని తలపెడుతున్నామో ఈ వెబ్ సిరీస్ ఎన్నో ప్రశ్నలను సంధిస్తుంది. ఈ వెబ్ సిరీస్ కు చివరి ఎపిసోడ్ హైలైట్ గా నిలిచింది. కేరళ రాష్ట్రంలో జరిగిన ఏనుగు దంతాల స్మగ్లింగ్ దేశ రాజధాని లో ఎలా వెలుగు చూసింది? విచారణ బృందం ఢిల్లీ నుంచి మళ్లీ కేరళ ఎలా చేరుకుంది? చివరికి వారికి ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహం లభించింది? అనే విషయాలను దర్శకుడు పూస గుచ్చినట్టు వివరించారు.
ఈ వెబ్ సిరీస్ లో నిమిషా సజయన్, రోషన్ మాథ్యూ, దివ్యేందు భట్టాచార్య తమ పాత్రల్లో జీవించారు. అంకిత్ మాధవ్, కని కుస్రుతి, సూరజ్ పాప్స్, రంజిత మీనన్, వినోద్ షరావత్, స్నూప్ దినేష్ మిగతా పాత్రల్లో నటించారు. ఈ వెబ్ సిరీస్ కు రిచి మెహతా దర్శకత్వం వహించాడు. ఈ వెబ్ సిరీస్ నిర్మాణంలో ఆలియా భట్ ఒక నిర్మాతగా వ్యవహరించడం విశేషం.