Thandel Trailer Review : అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ లో తెరకెక్కిన రెండవ చిత్రం ‘తండేల్’. కార్తికేయ సిరీస్ ఫేమ్ చందు మొండేటి దర్శకత్వం లో గీత ఆర్ట్స్ పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సుమారుగా 80 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో నిర్మించాడు. ఈ చిత్రం పై మొదటి నుండి అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. పాటలు విడుదలయ్యాక ఆ అంచనాలు పదింతలు ఎక్కువ అయ్యాయి. దేవి శ్రీ ప్రసాద్ మరోసారి తన విశ్వరూపం చూపించేసాడని చెప్పొచ్చు. చాలా మంది దేవి శ్రీ ప్రసాద్ పని ఇక అయిపోయింది, ఆయన మ్యూజిక్ జనాలకు ఎక్కట్లేదు అని కామెంట్స్ చేసేవారు. సరైన కంటెంట్ పడితే దేవిశ్రీ ప్రసాద్ తనలోని టాలెంట్ మొత్తాన్ని బయటకి తీస్తాడు అనడానికి ఈ చిత్రం ఒక ఉదాహరణ. ఇకపోతే కాసేపటి క్రితమే ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేసారు.
వైజాగ్ లోని శ్రీ రామ థియేటర్ లో ఒక ఈవెంట్ ని ఏర్పాటు చేసి ముందుగా అక్కడ అభిమానులకు ట్రైలర్ ని చూపించిన తర్వాత యూట్యూబ్ లో అప్లోడ్ చేసారు. రెస్పాన్స్ అదిరిపోయింది. ఈ చిత్రం లోని షాట్స్ ని చూస్తుంటే ప్రేమ, దేశభక్తి అంశాలను ఆధారంగా తీసుకొని డైరెక్టర్ చందు మొండేటి ఒక కల్ట్ క్లాసిక్ తీసాడు అనే అనుభూతిని కలిగించింది. గతంలో ఇలా మణిరత్నం ‘రోజా’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. దేశవ్యాప్తంగా ఈ సినిమా ఒక ప్రభంజనం. మళ్ళీ చాలా కాలం తర్వాత అలా ప్రేమ, దేశభక్తి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘సీతారామం’ చిత్రం కూడా అద్భుతమైన విజయం సాధించింది. ‘తండేల్’ చూస్తుంటే ఇద్దరి మధ్య ప్రేమను ఎంత ఎమోషనల్ గా తీసాడు అనిపించిందో, దేశభక్తి కూడా సమపాళ్లలో అంతే ఎమోషనల్ తీసినట్టు అనిపించింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ ఫార్ములా గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో, జనాలకు ఈ చిత్రం అలా కనెక్ట్ అయితే కలెక్షన్స్ కి ఆకాశమే హద్దు అనే విధంగా ఉంటుంది.
ట్రైలర్ చూస్తుంటే స్టోరీ మొత్తం దాదాపుగా అందరికీ అర్థం అయిపోయినట్టే. చేపల వేట కోసం వెళ్లిన తన మనుషులు, సముద్రం లో అలజడి కారణంగా పాకిస్థాన్ తీరానికి చేరుకుంటారు. ఎన్ని రోజులైనా తిరిగి రాకపోవడంతో తండేల్ (కెప్టెన్) నాగచైతన్య తన వాళ్ళ కోసం వెతికేందుకు సముద్ర ప్రయాణం చేస్తాడు. ఈ క్రమంలో పాకిస్థాన్ సైన్యానికి చిక్కుతాడు. ప్రాణంగా ప్రేమించిన తన ప్రియుడి కోసం హీరోయిన్ సాయి పల్లవి ఎదురు చూస్తూ ఉంటుంది. మరి హీరో ప్రాణాలతో క్షేమంగా తన వాళ్ళని రక్షించుకొని పాకిస్థాన్ సైన్యం నుండి తప్పించుకున్నాడా?, లేదా ప్రాణ త్యాగం చేశాడా అనేదే స్టోరీ. వినేందుకు ఈ స్టోరీ ఎంతో అద్భుతంగా ఉంది కదూ?, సరిగ్గా తీస్తే బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వుధి. అయితే నాగ చైతన్య, సాయి పల్లవి శ్రీకాకుళం యాస అనుకున్న స్థాయిలో ఆడియన్స్ కి ఎక్కలేదు, సినిమాలో కూడా ఇలాగే ఉంటే ఫలితం తారుమారు అవ్వొచ్చు. చూడాలి మరి ఫిబ్రవరి 7వ తారీఖున ఎలాంటి ఫలితం వస్తుంది అనేది.