Pawan Kalyan- Nikesha Patel: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాకతో వైజాగ్ లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక్కడ జనసేన, అధికార వైసీపీలు ఒకేరోజు కార్యక్రమాలు నిర్వహించడంతో రెండు పార్టీల మధ్య క్లాష్ ఏర్పడింది. జనసైనికుల దాడిలో మంత్రుల కార్లు ధ్వంసమయ్యాయి. పవన్ పర్యటనను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. విశాఖలోని నోవాటెల్ హోటల్ లో ఉన్న పవన్ కల్యాణ్ ను పోలీసులు చుట్టుముట్టారు. ఆయనను బయటకు రాకుండా నిర్బంధించారు. అయితే పవన్ కల్యాణ్ కు అండగా మేమున్నామంటూ ఈ హోటల్ దగ్గరికి భారీగా అభిమానులు, జనసేన కార్యకర్తలు తరలివచ్చారు. అటు తెలుగుదేశం పార్టీ కూడా సపోర్టుగా నిలిచింది. ప్రభుత్వంపై విరుచుకుపడుతూ పవన్ కళ్యాణ్ కొన్ని ట్వీట్లు చేశారు. ఈ ట్వీట్లకు పవన్ కల్యాణ్ తో నటించిన ఓ హీరోయిన్ కూడా స్పందించడం విశేషం

‘జనవాణి’ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు పవన్ విశాఖకు వచ్చారు. ఇదే సమయంలో ఇక్కడ గర్జన నిర్వహించాలని వైసీపీ నాయకులు వచ్చారు. అయితే ఎయిర్ పోర్టులో జనసేన, వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగి ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. దీంతో పవన్ బస చేసిన నోవాటెల్ హోటల్ ను పోలీసులు దిగ్బంధించారు. ఎలాంటి ర్యాలీలు నిర్వహించవద్దని నోటీసులు పంపారు. అలాగే మీటింగ్ లకు కూడా అనుమతి లేదని చెప్పారు.
ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ పవన్ వ్యంగంగా ట్వీట్ చేశారు. ‘నేను అలా బీచ్ కు వెళ్లి స్వేచ్ఛగా గాలి పీల్చుకోవాలని ఉంది.. అనుమతి ఇస్తారా..?’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే సినీ ఇండస్ట్రీ నుంచి ఓ హీరోయిన్ ఈ ట్వీట్ కు రిప్లై ఇచ్చింది. ఆమె ఎవరో కాదు. ‘కొమురం పులి’ సినిమాలో పవన్ తో నటించిన నిఖిషా పటేల్. ఈ సందర్బంగా ఆమె ‘నేను నీతోనే ఉన్నానంటూ..’ మెసేజ్ పెట్టింది. దీంతో పవన్ ఫ్యాన్స్ ఆమెను మెచ్చుకుంటున్నారు.

గతంలోనూ పవన్ కల్యాణ్ విషయంలో నిఖిషా సోషల్ మీడియాలో కనిపించింది. తాను పవన్ కల్యాణ్ తో ఒకే ఒక్క సినిమాలో నటించానని.. కానీ ఇప్పటికీ ‘కొమురం పులి హీరోయిన్?’ ‘పవన్ హీరోయిన్ ’అని పిలుస్తున్నారని చెప్పింది. ఈ సందర్భంగా చిరంజీవి, పవన్ కల్యాణ్ గురించి మాట్లాడింది. తాజాగా వపన్ కు సపోర్టు ఇవ్వడంతో ఆమె జనసేనలో చేరుతుందా..? అనే వార్తలు వస్తున్నాయి. ఒకవేళ చేరితే పవన్ ఆమెకు ఎలాంటి పోస్ట్ ఇస్తారో చూడాలి.