
Pawan Kalyan: నిన్న (సెప్టెంబర్ 2) పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) బర్త్ డే. ఈ సందర్భంగా పవన్ ఫ్యాన్స్ ఎంత హంగామా చేశారో తెలిసిందే. సోషల్ మీడియా మొత్తం పవన్నామస్మరణతో మార్మోగిపోయింది. సినీ, రాజకీయ ప్రముఖులు పవన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమయంలో పవన్ సినీ, రాజకీయ జీవితంపై తీవ్రస్థాయిలో చర్చ సాగింది. పవన్ సోదరులు, కుటుంబం గురించి కూడా చర్చ వచ్చింది. దీంతో.. పవన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన తోబుట్టువుల విషయం కూడా తెరపైకి వచ్చింది. ఆ వివరాలు ఏంటన్నది చూద్దాం.
పవర్ స్టార్ కెపాసిటీ ఇప్పుడు ఏంటన్నది అందరికీ తెలుసు. ఆయనో అసామాన్యుడు. కానీ.. పాతికేళ్ల క్రితం చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయమైనప్పుడు ఓ సామాన్యుడు. తొలి చిత్రం అక్కడమ్మాయి.. ఇక్కడబ్బాయి నుంచి వరుసగా ఏడు చిత్రాలు హిట్ కొట్టాడు. ప్రతీ సినిమాకు తన రేంజ్ ను పెంచుకుంటూ వచ్చాడు. నాలుగో చిత్రంగా వచ్చిన తొలి ప్రేమతో స్టార్ హీరోగా మారిపోయాడు పవన్. ఆ విజయపరంపర కొనసాగించిన పవన్.. ఏడో చిత్రంగా వచ్చిన ఖుషీతో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ కొట్టి.. బాక్సాఫీస్ ను షేక్ చేశాడు.
ఆ తర్వాత నుంచి డౌన్ ఫాల్ మొదలైంది. వరుసగా ఏడు హిట్లు కొట్టిన పవన్ కు.. అంతకు మించి అన్నట్టుగా.. వరుసగా 8 చిత్రాలు పరాజయాన్ని రుచిచూపాయి. మామూలు పరాజయాలు కాదు.. భారీ డిజాస్టర్లేనని చెప్పాలి. ఆ విధంగా.. పది సంవత్సరాలపాటు హిట్టు అనేదే లేకుండా కెరీర్ కొనసాగించాడు. నిజానికి ఈ పరిస్థితి వేరే హీరోకు ఎదురైతే.. ఖచ్చితంగా మరోలా ఉండేది. ఒక హిట్టు కొడితే.. ఒక మెట్టు పైకి, ఒక ఫ్లాప్ పడితే రెండు మెట్లు కిందకు కెరీర్ గ్రాఫ్ జారిపోయే ఇండస్ట్రీలో.. వరుసగా పదేళ్లపాటు ఒక్క సక్సెస్ కూడా లేని పవన్ పరిస్థితి ఎలా ఉండాలి? కానీ.. అలా జరగలేదు సరికదా.. అభిమానులు ఆ పదేళ్లలో రెట్టింపయ్యారు. పరాజయం ఎదురైన ప్రతిసారీ.. అభిమానులే ఎక్కువగా బాధపడ్డారు. వారి వేదన చూసి.. తాను బాధపడ్డానని, అందుకోసం ఒక్క హిట్టు కావాలని కోరుకున్నానని స్వయంగా చెప్పారు పవన్. సీన్ కట్ చేస్తే.. 2012లో గబ్బర్ సింగ్ తో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నారు.
మరి, ఎందుకు పవన్ ను ఇంతగా అభిమానిస్తారు? ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటీ? అన్నప్పుడు ముందుగా కనిపించేవి రెండు గుణాలు. ఒకటి.. షూటింగులోగానీ, బయట కానీ.. వ్యక్తిని బట్టి గౌరవం ఇవ్వడం పవన్ కు తెలియదు. ప్రముఖులైనా, సెట్లో బాయ్ అయినా.. ఇద్దరినీ ఒకేలా గౌరవిస్తారు పవన్. ఈ విషయాన్ని ఎంతో మంది సినీరంగానికి చెందినవారు చెప్పారు. ఇక, రెండోది.. ఎవరైనా కష్టాల్లో ఉంటే.. వెంటనే ఆదుకునేందుకు ముందుంటారు. ఎవ్వరికీ తెలియకుండా.. ఎన్నో దానాలు చేశారు పవన్. అందరికీ తెలిసినవి చాలా తక్కువ అని అంటారు పవన్ సన్నిహితులు. ఈ విధంగా.. తన సినిమాల్లోనూ స్పెషల్ మేనరిజంతోపాటు.. ఇతరులకు లేని వ్యక్తిత్వం, క్వాలిటీతో ఎవరెస్టు రేంజ్ కు ఎదిగారు పవన్.
అయితే.. పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకోవడం పవన్ కు అలవాటు లేదు. అభిమానులు ఎంత హడావిడి చేసినా.. ఆయన మాత్రం కేక్ కటింగులు వంటి వాటికి దూరంగా ఉంటారు. దీనికి గల కారణాలను గతంలో చెప్పారు పవన్. తన కుటుంబంలోని ఆర్థిక పరిస్థితుల కారణంగా.. పుట్టిన రోజు వంటివి జరుపుకోవడం చిన్ననాటి నుంచి అలవాటు లేదని చెప్పారు పవన్. అందుకే.. ఇప్పటికీ తాను అలాంటి వేడుకలకు దూరంగా ఉంటానని తెలిపారు. ఇదే సమయంలో.. తన కుటుంబం గురించి కూడా తెలిపారు.
పవన్ తోడ నలుగురు ఉన్నారన్నది అందరికీ తెలిసిందే. చిరంజీవి, నాగబాబుతోపాటు ఇద్దరు సోదరీమణులు జన్మించారు. అయితే.. వీళ్లు ఐదుగురు కాకుండా.. మరో ముగ్గురు కూడా జన్మించారట. అంటే.. పవన్ కుటుంబంలో మొత్తం ఎనిమిది మంది తోబుట్టువులు ఉండేవారు. కానీ.. అనారోగ్యం వంటి కారణాలతో ఆ ముగ్గురూ చనిపోయారట. చిన్ననాటి పరిస్థితులను జీవితంలో భాగం చేసుకున్న పవన్.. పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండడంతోపాటు.. హంగూ ఆర్భాటాలు లేకుండా సింప్లి సిటీకి నిదర్శనంగా ఉంటారు. అందరినీ గౌరవిస్తూ.. కష్టాల్లో ఉన్న ప్రజల కోసం ఏదైనా చేయాలని తపిస్తుంటారు. అందుకే.. పవర్ స్టార్ అంటే అంత అభిమానం.