Pavitra Lokesh: ఓ నెల రోజుల పాటు నరేష్-పవిత్రా లోకేష్ వ్యవహారం టాలీవుడ్ ని ఊపేసింది. నరేష్, పవిత్ర లోకేష్, రమ్య రఘుపతి, సుచేంద్రన్ కేంద్రంగా పెద్ద హైడ్రామా నడిచింది. నరేష్-పవిత్ర లోకేష్ వివాహం చేసుకున్నారన్న ప్రచారంతో మొదలైన వివాదం అనేక మలుపులు తీసుకుంది. మహాబలేశ్వర్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తూ నరేష్, పవిత్ర లోకేష్ కెమెరా కంటికి చిక్కారు. వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నరేష్ నాలుగో వివాహం చేసుకున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ కథనాలకు నరేష్ వివరణ ఇచ్చారు. ఆయన ఓపెన్ గా తమ రిలేషన్ ఏమిటో స్పష్టం చేశారు.

పవిత్ర లోకేష్ ని నేను వివాహం చేసుకోలేదు. మేము సహజీవనం చేస్తున్నాము. వివాహ వ్యవస్థపై నాకు నమ్మకం లేదు. పవిత్ర లోకేష్ నన్ను అభిమానించే నమ్మదగిన వ్యక్తి అందుకే ఆమెతో నేను ప్రయాణం చేస్తున్నాను. ప్రస్తుతానికి పెళ్లి ఆలోచన లేదు. భవిష్యత్ లో ఏం జరుగుతుందో చూద్దాం అన్నాడు. వీరి రిలేషన్ ని మూడో భార్య రమ్య రఘుపతి ఖండించారు. నాకు విడాకులు ఇవ్వకుండా నరేష్ మరొక మహిళలతో రిలేషన్ ఎలా పెట్టుకుంటాడని ఆరోపించారు. మైసూర్ హోటల్ లో నరేష్, పవిత్రలపై దాడికి తెగబడ్డారు.
తిరిగి నరేష్ రమ్య రఘుపతిపై ఆరోపణలు చేశాడు. ఆమె క్యారెక్టర్ మంచిది కాదు, నన్ను డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేసిందంటూ తీవ్ర స్థాయిలో విమర్శించాడు. మరోవైపు పవిత్ర లోకేష్ మాజీ భర్త సురేంద్రన్ ఆమెపై విమర్శల దాడి చేశారు. మెల్లగా ఈ వివాదం సద్దుమణిగింది. కృష్ణ మరణం తర్వాత మరలా తెరపైకి వచ్చింది. కృష్ణ పార్ధీవ దేహం వద్ద నరేష్, పవిత్ర అన్నీ తామై వ్యవహరించారు. ఇది కొంత విమర్శలకు దారి తీసింది .

ఇదిలా ఉంటే… పవిత్ర లోకేష్ సైబర్ పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తుంది. ఆమెపై కొన్ని మీడియా ఛానల్స్ దుష్ప్రచారం చేస్తున్నాయి. మార్ఫింగ్ ఫోటోలతో మానసిక వేదనకు గురి చేస్తున్నారు, అంటూ పవిత్ర ఫిర్యాదు చేశారు. అసత్య ప్రచారం చేస్తున్న మీడియా సంస్థల మీద చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు నరేష్-పవిత్ర లోకేష్ కాంబినేషన్ లో మూవీ తెరకెక్కుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇది వారిద్దరి వాస్తవ జీవితాలను అద్దం పట్టేది గా ఉంటుందట.