The Legend of Maula Jatt: ఒక సినిమాను తీసి ప్రేక్షకులకు అందించిన తరువాత దాని రేంజ్ ఏంటో ప్రేక్షకులు నిర్ణయిస్తారు. ఈ క్రమంలో కొన్ని సినిమాలు బొక్కబోర్లా పడుతాయి.. కొన్ని సినిమాలు బాక్సాపీస్ ను కొల్లగొడుతాయి.. బాక్సాపీస్ వద్ద రికార్డులు బద్దలు కొట్టిన సినిమాలు మన దేశంలో చాలానే ఉన్నాయి. దాదాపు రూ.1000 కోట్ల వరకు వసూళ్లు చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. అయితే ప్రస్తుత కాలంలో ఒక సినిమా రూ.100 కోట్ల క్లబ్ లోకి రావాలంటే తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. ఈ తరుణంలో పాకిస్తాన్ దేశంలో ఓ సినిమా 100 కోట్లు సాధించి చరిత్ర సృష్టించింది. ఒక సినిమా 100 కోట్ల మార్క్ ను దాటడం మనకు పెద్ద విషయం కాదు. కానీ పాకిస్తాన్ లో మొట్టమొదటి సారిగా ఓ పంజాబీ చిత్రం 100 కోట్ల క్లబ్ లో చేరి రికార్డు నెలకొల్పింది. హిస్టారికల్ నేపథ్యంలో వచ్చిన ‘ది లెజెండ్ ఆఫ్ మౌలా జట్’ అనే చిత్రం గురించి ఇప్పుడు ప్రపంచం మాట్లాడుకుంటుంది. ఆ చిత్రం విశేషాలేంటో తెలుసుకుందాం.

‘ది లెజెండ్ ఆఫ్ మౌలా జట్’ ఒక పంజాబీ యాక్షన్ డ్రామా చిత్రం. లసారి ఫిల్మ్స్, ఎన్ సైక్లోమీడియా ప్రొడక్షన్ బ్యానర్ పై అమ్మారా హిక్మత్, డాక్టర్ అసద్ జమీల్ ఖాన్ లు ఈ సినిమాను నిర్మించారు. బిలాల్ లస్హరి డైరెక్టర్. 1979లో వచ్చిన పాకిస్తాని కల్డ్ క్లాసికల్ మూవీకి అనుకరణగా చెబుతున్నారు. ఈ సినిమా కథను నాసిర్ అదీప్ ఆధారంగా రూపొందించారు. ఇందులో హంజా అలీ అబ్బాసీ, హుమైమా మాలిక్, మహిరా ఖాన్ లు ప్రధాన పాత్రల్లో నటించారు. మౌలా జట్ అనే పాత్రలో నూరి నట్ పోషించాడు. వాస్తవానికి ఈ సినిమా తీయాలని 2013లోనే డైరెక్టర్ బిలాల్ అనుకున్నారు. అందుకు సంబంధించిన కథను కూడా రెడీ చేశాడు. 2017లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించగా.. 2019లో ముగించారు.
2020లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ కాపీరైట్, సంబంధిత సమస్యలతో వాయిదా పడుతూ వచ్చింది. ఇంతలో కరోనా రావడంతో మరింత ఆలస్యమైంది. ఇలా కొన్ని సంవత్సరాలు ఆగిన తరువాత అక్టోబర్ 12, 2022న థియేటర్లోకి తెచ్చారు. దీనిని పాకిస్తాన్ లో మాండ్వివాలా ఎంటర్టైన్మెంట్ హక్కులు తీసుకొని థియేటర్లో రిలీజ్ చేసింది. అప్పటి నుంచి పాకిస్తాన్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ‘ది లెజెండ్ ఆఫ్ మౌలా జట్’ 5.2 మిలియన్లకు పైగా వసూళ్లు రాబట్టింది.అయితే పాకిస్తాన్లోనూ ఈ మూవీని ఆదరించారు. దీంతో ఇక్కడ 100 కోట్ల మార్క్ దాటినట్లు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

పాకిస్తాన్ లో మొదటి వారంలో సల్మాన్ ఖాన్ ‘సుల్తాన్’ 11.30 కోట్లు కలెక్షన్లు సాధిస్తే.. ఇప్పుడు ‘ది లెజెండ్ ఆఫ్ మౌలా జట్’ మొదటి వారంలో 14.50 కోట్లు వసూళ్లు చేసింది. దీంతో అత్యంత వేగంగా వసూళ్లు సాధిస్తున్న సినిమాగా ‘ది లెజెండ్ ఆఫ్ మౌలా జట్’ నిలిచింది. ఇన్నాళ్లు పాకిస్తాన్లో 100 కోట్ల సినిమా అంటూ లేదు. కానీ ఇప్పుడు చెప్పుకోవడానికి ‘ది లెజెండ్ ఆఫ్ మౌలా జట్’ ఉందని కొందరు సినీ వర్గాలుచర్చించుకుంటున్నారు. ముందు ముందు ఈ మూవీ మరిన్ని వసూళ్లు చేయవచ్చని అంటున్నారు.