Om Shanti Shanti Shantihi Review: నటీనటులు: తరుణ్ భాస్కర్ దాస్యం, ఈషా రెబ్బా, బ్రహ్మాజీ తదితరులు.
సంగీతం: జే క్రిష్
ఛాయాగ్రహణం: దీపక్
దర్శకత్వం: AR సజీవ్
నిర్మాత: సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టే, వివేక్ కృష్ణాని, అనూప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ శనివారపు.
కరోనా అనంతరం, ఓటీటీ ల విప్లవం తర్వాత తెలుగులో రీమేక్ సినిమాలు పెద్దగా విజయాలు సాధించడం లేదు. దీంతో రీమేక్ సినిమాల సంఖ్య గణనీయంగా తగ్గింది. అయినా కొందరు మేకర్స్ మాత్రం పాత అలవాటు మానుకోలేక రీమేక్ లపై ఇంకా ఆధారపడుతున్నారు. మలయాళంలో విజయం సాధించిన జయ జయ జయహే చిత్రానికి రీమేక్ గా ఈ ఓం శాంతి శాంతి శాంతిః తెరకెక్కింది. చాలా రోజుల తర్వాత తెలుగు ప్రేక్షకులను పలకరిస్తున్న ఒక రీమేక్ సినిమా ఎలా ఉంది? అడియన్స్ కు కిక్కిచ్చేలా ఉందా లేదా అనేది రివ్యూలో చూద్దాం.
మహిళలు వంటింట్లోనే ఉండాలి, తలవంచుకునే ఉండాలి, మగాళ్లకు ఎదురు మాట్లాడకూడదు లాంటి బూజు పట్టిన భావాలున్న పురుషాధిక్య సమాజానికి ఒక ఉదాహరణ లాంటి ఒక తెలుగు కుటుంబం. ఆ కుటుంబంలో మిల్లీ మీటర్ కూడా స్వేచ్ఛ లేని అమ్మాయే మన హీరోయిన్ ప్రశాంతి(ఈషా రెబ్బా). ఈ అమ్మాయిని చేపల వ్యాపారి అయిన అంబటి ఓంకార్ నాయుడు(తరుణ్ భాస్కర్) కు ఇచ్చి పెళ్లి చేస్తారు తల్లిదండ్రులు. అయితే మన నాయుడిగారికి ఒక వీక్ నెస్. ముక్కు మీద కోపం. తనకు నచ్చని పని చేస్తే కొట్టడమే పని. పెళ్ళయిన కొత్తలో బాగానే ఉన్నా రోజులు గడిచేకొద్ది లోపలున్న కోపిష్టి మనిషి బైటికి రావడంతో పెళ్ళాన్ని కొట్టడం మొదలు పెడతాడు. ప్రశాంతి మొదట్లో సర్దుకుంటుంది కానీ తర్వాత భరించలేక పుట్టింటివారికి చెప్పుకుంటుంది. కానీ వాళ్ళు మాత్రం ‘సర్దుకో’ అని మేల్ డామినేటెడ్ సొసైటీ సెక్షన్ 1 లోని రూల్ ను కోట్ చేసి ఫాలో అయిపోమంటారు. కానీ హీరోయిన్ మాత్రం ఆ సెక్షన్లు పట్టించుకోకుండా తిరగబడి మొగుడికి నాలుగు దెబ్బలు తగిలిస్తుంది. దీంతో గొడవలు పెద్దవి అవుతాయి. ఈ గొడవలు ఎలాంటి పరిస్థితులకు దారితీశాయి? ప్రశాంతి అనే ఈ విప్లవ మహిళ, పురుషాధిక్య కుటుంబాలకి ఎటువంటి సందేశం ఇచ్చిందనేది మిగతా కథ.
భార్య తిరగబడడం అనే పాయింట్ కొత్తగా ఉంది తప్ప మిగతా ట్రీట్మెంట్ అంతా చప్పగా సాగింది. మలయాళం ఒరిజినల్ ను ఓటీటీలో చూసిన వారికి ఇది పెద్దగా రుచించకపోవచ్చు. ఆ సినిమా చూడనివారికి కూడా పెద్దగా కిక్కిచ్చే పరిస్థితి అయితే లేదు. ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడా కొన్ని కామిక్ ఎలిమెంట్స్ ఉన్నా అవి చిరునవ్వు స్థాయిలోనే ఆగిపోతాయి. అబ్బాయిలని ఎక్కువగా, అమ్మాయిలను తక్కువగా చూడడం అనే కాన్సెప్ట్ తెలుగులో ఎప్పుడో అరిగిపోయింది. దాంతో ఫస్ట్ హాఫ్ లో చాలా సీన్స్ మరీ రొటీన్ గా అనిపిస్తాయి. ఇంటర్వల్ బ్లాక్ కొంత ఆసక్తికరంగా ఉన్నా సెకండ్ హాఫ్ పూర్తిగా తేలిపోయింది. ముఖ్యంగా క్లయిమాక్స్ కూడా సహజంగా అనిపించలేదు.
మొరటుమనిషిగా, కోపిష్టి భర్తగా తరుణ్ భాస్కర్ నటన డీసెంట్ గా ఉంది. గోదావరి యాస కూడా తనకు సూట్ అయింది. ఈషా రెబ్బా కూడా తన పాత్రకు తగ్గట్టుగా చక్కగా నటించింది. హీరో మేనమామ పాత్రలో బ్రహ్మాజీ కూడా ఓకే. సినిమా కథ పరంగా కామెడీకి స్కోప్ ఉన్నప్పటికీ బ్రహ్మాజీకి అంతగా స్కోప్ దక్కలేదు. దీపక్ సినిమాటోగ్రఫీ డీసెంట్ గా ఉంది. సంగీతం కూడా వీక్ గా ఉంది. అక్కడక్కడా కొన్ని డైలాగ్స్ బాగున్నప్పటికీ ఓవరాల్ గా కామెడీ అయితే పండలేదు. టికెట్ కొని థియేటర్ కు వెళ్ళి సినిమా చూడడం అయితే దండగ. ఓటీటీలో ఫాస్ట్ ఫార్వర్డ్ బటన్ మీద వేలు పెట్టి చూడాల్సిన సినిమా.
– సినిమాలో బాగోలేనివి ఇవీ..
1. ఒరిజినల్ లో ఉండే థ్రిల్, కామెడీ మిస్ కావడం
2. తేలిపోయిన సెకండ్ హాఫ్
3. చాలా సీన్స్ అవుట్ డేటెడ్ గా ఉండడం
– ఇందులో ఏం బాగున్నాయో తెలుసా?
1. సినిమా థీమ్
2. తరుణ్, ఈషాల నటన
రేటింగ్: 2 /5
ఫైనల్ వర్డ్: ఓటీటీ సినిమా