
ప్రతిష్టాత్మకమైన ఎన్టీఆర్ 30వ సినిమా. అగ్రదర్శకుడు త్రివిక్రమ్ తో ఫిక్స్ అయ్యింది. కానీ.. ఇప్పుడు లేదంటూ వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ తప్పుకున్నాడంటున్నారు కొందరు! త్రివిక్రమ్ డ్రాప్ అయ్యాడని అంటున్నారు ఇంకొందరు! కథాచర్చల్లో ప్రతిష్టంభన కారణంగా.. స్నేహపూర్వకంగానే సినిమా ఆపేశారని అంటున్నారు మరికొందరు! అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగింది? ప్రస్తుతం ఏం జరుగుతోంది? రేపు ఏం జరగబోతోంది? మాకు తెలియాలి.. తెలిసి తీరాలి అంటున్నారు ఫ్యాన్స్. దీంతో.. అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వబోతున్నారు.
‘అరవింద సమేత’ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో మరో సినిమాకు ప్లాన్ జరిగిన సంగతి తెలిసిందే. కానీ.. ఉన్నట్టుండి ఆ సినిమా ఆగిపోయిందనే ప్రచారం తెరపైకి వచ్చింది. సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఎలాంటి సినిమా చేయాలనే విషయంలో వీరిద్దరికీ పొంతన కుదరకపోవడ వల్లే సినిమా ఆగిపోయిందంటూ వార్తలు వచ్చాయి.
మంత్రిగారి వియ్యంకుడు లాంటి సినిమా చేద్దామని త్రివిక్రమ్ సూచించగా.. జూనియర్ వద్దన్నాడని ప్రచారం సాగింది. దీంతో.. త్రివిక్రమ్ ఒక భారీ యాక్షన్ లైనప్ చెప్పాడని, కానీ.. ఎన్టీఆర్ అదికూడా వద్దన్నాడని రూమర్స్ వచ్చాయి. RRR తర్వాత చేస్తున్న సినిమా కాబట్టి, పక్కా స్క్రిప్టుతో వస్తేనే చేస్తానని జూనియర్ చెప్పాడని చర్చ సాగింది.
దీనికి త్రివిక్రమ్ నొచ్చుకున్నాడని కూడా ఓ రూమర్ స్ప్రెడ్ అయ్యింది. ఎన్టీఆర్ అలా అనడంతో.. ‘నా మీద నమ్మకం లేదా?’ అనడం.. ఎన్టీఆర్ మౌనం వహించడంతో డీల్ క్యాన్సిల్ అయ్యిందంటూ పలు రకాల కథనాలు తెరపైకి వచ్చాయి. అంతేకాదు.. కొరటాల శివ లైన్లోకి వచ్చాడని, ఎన్టీఆర్ 30వ సినిమా దర్శకుడు ఆయనే అని కూడా పుకార్లు వినిపించాయి. ఇలాంటి వార్తలతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కలత చెందారు. అసలు ఏం జరిగిందో క్లారిటీ ఇవ్వాలంటూ పట్టుబట్టారు.
ఈ నేపథ్యంలో.. ఎన్టీఆర్ పీఆర్వో, సినిమా నిర్మాత అయిన మహేష్ కోనేరు ఈ సినిమాపై క్లారిటీ ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. ఇవాళ సాయత్రం 7 గంటలకు అఫీషియల్ గా సినిమాపై అనౌన్స్ మెంట్ ఇవ్వనున్నట్టు చెప్పారు. మరి, ఆ ప్రకటనలో ఏం ఉండబోతోంది? ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా ఉంటుందా? లేదా? అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.