Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి కేంద్రం ఇటీవల పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించింది. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు, అభిమానులు, రాజకీయ నేతల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చిరంజీవి శనివారం రాత్రి హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో పార్టీ ఇచ్చారు. దీనికి సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానించారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున సత్కారం..
కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డులు ప్రకటించిన తెలంగాణ వాసులను రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఆదివారం సత్కరించింది. ఈ కార్యక్రమానికి పద్మ విభూషణ్‌కు ఎంపికైన మెగాస్టార్ చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, పద్మశ్రీకి ఎంపికైన కొండప్ప, గడ్డం సమ్మయ్య, ఆనందాచారి, కేతావత్ సోమ్‌లాల్, కూరెళ్ల విఠలాచార్య హాజరయ్యరు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరై అవార్డు గ్రహీతలను సత్కరించారు
చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు..
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడారు. తనతోపాటు సత్కారం పొందినవారికి శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయాలు రానురాను దుర్భాషలు, వ్యక్తిగత విమర్శలతో దిగజారిపోతున్నారని అన్నారు. మాట అనడం.. మాట పడడం తనకు నచ్చదన్నారు. నోరు జారే వాళ్లను, దుర్భాషలాడేవారిని, వ్యక్తిగత విమర్శలు చేసేవారిని తిప్పికొట్టే శక్తి సరైన నాయకులను నిర్ణయించే శక్తి ప్రజలకే ఉందన్నారు.
అభిమానులకు కృతజ్ఞతలు..
ఇక పద్మవిభూషణ్ వచ్చినప్పుడు కలిగిన సంతోషం.. పద్మ విభూషణ్ ప్రకటించినప్పుడు కలుగలేదని చిరంజీవి అన్నారు. ‘సరే వచ్చింది సంతోషం, గౌరవంగా స్వీకరించాలి అనుకున్నా అంతే’ అని పేర్కొన్నారు. కానీ ఆ తర్వాత అభిమానులు, వివిధ రంగాలకు చెందిన వారి ప్రశంసలు చూస్తేంటే ఎంతో ఉద్వేగానికి లోనయ్యానని తెలిపారు. అవార్డు ఇవ్వని ప్రోత్సాహం, ఉత్సాహం మీ కరతాళ ధ్వనుల ద్వారా లభించిందని చెప్పారు. అది చూసిన తర్వాత ఈ జన్మకు ఇది చాలు అనిపించిందని చిరంజీవి వెల్లడించారు.