Adhipurush: బాహుబలి సినిమాతో పాన్ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న హీరో ప్రభాస్. ఇదే జోరుతో వరుసగా పాన్ ఇండియా తరహా సినిమాలతో ముందుకు దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఓం రౌత్‌తో కలిసి ఆదిపురుష్‌లో నటిస్తున్నారు. రామాయణం ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో కనిపించనున్నారు. కాగా, ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ఓం రౌత్ ఓ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 103 రోజుల్లో ఆదిపురుష్ షూట్ పూర్తయింది. ఈ అద్భుతమైన ప్రయాణం గమ్యానికి చేరుకుంది. ఎంతోమంది కష్టంతో మేము సృష్టించిన ఈ మేజిక్‌ను మీతో పంచుకోవడం కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నాం అని తెలిపారు.
It's a shoot wrap for Adipurush!!!
A wonderful journey has come to its finish line. Can't wait to share with you the magic we have created.#Adipurush #103DaysOfShoot pic.twitter.com/prMUp5fA4S— Om Raut (@omraut) November 11, 2021
ప్రస్తుతం ఈ పోస్ట్‌పై రెబల్ స్టార్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంత తక్కువ టైంలో షూటింగ్ పూర్తి చేశారని.. అదే స్పీడ్‌లో ప్రభాస్ ఫస్ట్లుక్ కూడా విడుదల చేయండంటూ.. ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.
భారీ బడ్జెట్, 3డీ సినిమాగా రానున్న ఆదిపురుష్‌లో సీత పాత్రలో కృతి సనన్ కనిపించనుంది. రావణాసురుడిగా బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాకు భూషణ్‌కుమార్, క్రిషన్‌కుమార్, ఓంరౌత్, ప్రసాద్ సుతార్, రాజేశ్ నాయర్ నిర్మాతలుగా వ్యవహరించారు. త్వరలోనే ఈ సినిమా విడుదలకు సంబంధించిన వివరాలు ప్రకటించే అవకాశముంది.
కాగా, మరోవైపు రాధేశ్యామ్ సినిమాలోనూ నటిస్తున్నారు ప్రభాస్. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. సలార్ చిత్రంలోనూ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే.