New Trains: వందే భారత్ పేరుతలో సంపన్నుల ప్రయాణాన్ని సౌకర్యవంతం, వేగవంతం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇప్పుడు పేదల సౌకర్యంపై దృష్టిసారించారు. ఇప్పటికే వందేభారత్ రైళ్లు పట్టాలపై పరుగులు పెడుతుండగా, త్వరలో అదే తరహాలో పేదల రైళ్లను పట్టాలెక్కించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది.
రైల్వేపైనే ఎక్కువ శ్రద్ధ..
కేంద్రంలోని నరేంద్రమోదీ దేశంలో రైల్వేపై ఎక్కువ దృష్టిపెట్టారు. కొత్తకొత్త రైళ్లను ప్రవేశపెడుతున్నారు. ఇప్పటికే వందేభారత్ రైళ్ల పేరుతో దాదాపు దేశమంతటా వేగవంతమైన రైళ్లు వచ్చాయి. ఇదే తరహాలో ఇక పేదలకు రైళ్లను ప్రవేశపెట్టేందకు మోదీ ప్రణాళిక సిద్ధం చేశారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే అమృత్ భారత్ పేరుతో పేదల రైళ్లు పట్టాలపై పరుగులు పెట్టనున్నాయి.
వేగవంతమైన ప్రయాణమే లక్ష్యంగా..
దేశంలో రైలు ప్రయాణికులను త్వరగా, సౌకర్యవంతంగా గమ్యస్థానాలకు చేర్చడమే లక్ష్యంగా మోదీ రైల్వేలను ఆధునికీకరిస్తున్నారు. ధర కాస్త ఎక్కువే అయినా, ప్రయాణం మాత్రం వేగవంతంగా జరుగుతోంది. దీంతో రైలు ప్రయాణికులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వందేభారత్ రైళ్లు విజయవంతం కావడంతో ఇప్పుడు అమృత్ భారత్‌పై దృష్టిపెట్టారు. మరి ఈ రైళ్లలో ప్రత్యేకత ఏంటి.. ఎలాంటి సౌకర్యలు ఉంటాయి అన్న విషయాలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.
మొదట రెండు రైళ్లు..
అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ను భారత రైల్వే వీలైనంత త్వరగా పట్టాలెక్కించేందుకు కసరత్తు చేస్తోంది. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్‌లో ఎన్నికలు ఉండడంతో వీలైనన్ని ఎక్కువ మార్గాల్లో అమృత్ భారత్ రైళ్లను ప్రవేశపెట్టాలనుకుంటున్నారు. డిసెంబర్ 30న మొదటగా రెండు రైళ్లను అందుబాటులోకి తెచ్చేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఒక రైలును ఢిల్లీ – దర్భంగా(బిహార్) మధ్య మరో రైలును బెంగాల్‌లోని మల్దా – బెంగళూరు మధ్య నడిపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
అమృత్ భారత్ ఫీచర్స్ ఇవే..
ఇక అమృత్ భారత్ రైళ్లను వందేభాత్ తరహాలోనే డైనమిక్‌గా డిజైన్ చేశారు. ఈ రైలులో 22 కోచ్‌లు ఉంటాయి. ఇందులో 8 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు, 12 సెకండ్ క్లాస్ త్రీటైర్ స్లీపర్ కోచ్‌లు, రెండు గార్డు కంపార్ట్‌మెంట్లు ఉంటాయి. ఈరైలు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఎక్కువ దూరాలకు తక్కువ ఖర్చుతో అత్యంత వేగంగా, సౌకర్యవంతంగా వెళ్లడమే ఈ అమృత్ భారత్ రైళ్ల లక్ష్యం. ఇక ఈ రైళ్లలో సీసీటీవీ కెమెరాలు, ప్రతీ సీటువద్ద మొబైల్ చార్జింగ్ పాయింట్, వాక్యూమ్ టాయిలెట్స్, సెన్సార్ ట్యాప్స్ ఏర్పాటు చేశారు. ఆధునిక డిజైన్, ఆకట్టుకునే రంగు, సౌకర్యవంతమైన సీట్లతో బెర్తులను తయారు చేశారు. ఈ రైళ్లకు ముందు, వెనుక ఇంజిన్లు ఉంటాయి.