
కెరీర్ ప్రారంభం నుంచి కొత్త దర్శకులు, ప్రతిభ ఉన్న యువకులను ప్రోత్సహిస్తూ వస్తున్నాడు కింగ్ నాగార్జున. వాళ్లపై నమ్మకం ఉంచి ధైర్యంగా సినిమాలు చేశాడు. అనేక విజయాలు ఖాతాలో వేసుకున్నాడు. అయితే, కొంతకాలంగా నాగార్జునకు ఆశించిన సక్సెస్ రావడం లేదు. సోగ్గాడే చిన్ని నాయన, ఊపిరి తర్వాత నాగ్ నటించిన చిత్రాలు అంతమాత్రంగానే ఆడాయి. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఆఫీసర్ అయితే భారీ డిజాస్టర్గా మిగిలింది. నానితో కలిసి నటించిన దేవదాస్ కూడా హిట్ కాలేదు. చివరగా రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ చేసిన బోల్డ్ మూవీ మన్మధుడు 2తో కూడా ఆడియన్స్ మెప్పు పొందలేకపోయింది. ప్రస్తుతం కరణ్ జోహార్ ప్రొడ్యూస్ చేస్తున్న హిందీ యాక్షన్ ఫాంటసీ ఫిల్మ్ ‘బ్రహ్మాస్త్ర’లో అమితాబ్ బబ్చన్, రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్‌లతో కలిసి నాగ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలాగే, తెలుగులో ‘వైల్డ్ డాగ్’ అనే మూవీ చేస్తున్నాడు. సాల్మోన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ఎన్‌ఐఏ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు నాగ్. ఇప్పుడు మరో యంగ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుతో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాను ఏషియన్ గ్రూప్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ, నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించబోతున్నాయి.
Also Read: సోనూ సూద్ సాయం నుంచి గుణపాఠాలివీ
‘పీఎస్‌వీ గరుడ వేగ 126.18 ఎమ్’తో రాజశేఖర్ కు సెకండ్ లైఫ్ ఇచ్చాడు ప్రవీణ్. తన ఫస్ట్ మూవీ ‘చందమామ కథలు’తో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడతను. 2014లో వచ్చిన ఈ మూవీతో నేషనల్ అవార్డు దక్కించుకున్నాడు. ఆపై, ‘గుంటూరు టాకీస్’ అనే అడల్ట్ మూవీతో కమర్షియల్ బాట పట్టినప్పటికీ ‘గరుడవేగ’తో అందరి మెప్పు పొందాడతను. దాంతో, నాగ్ అతనికి చాన్స్ ఇచ్చాడు. వీరిద్దరి కాంబినేషన్ ఆసక్తి కలిగిస్తోంది. అయితే, నాగ్-సత్తారు కాంబోలో వచ్చేది రీమేక్ మూవీనా? స్ట్రెయిట్ మూవీనీ అన్నది తేలాల్సి ఉంది.
Also Read: భల్లాలదేవతో బాలీవుడ్ క్వీన్ జోడీ
ఈ ఇద్దరూ బాలీవుడ్ హిట్ మూవీ ‘రైడ్’ను తెలుగులో రీమేక్ చేస్తున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. హిందీలో అజయ్ దేవగణ్ చేసిన ఐటీ డిపార్ట్‌మెంట్ ఐఆర్ ఎస్ ఆఫీసర్ పాత్రలో నాగ్ నటిస్తాడని అన్నారు. కానీ, నాగార్జున సన్నిహితులు మాత్రం ఈ వార్తలను కొట్టి పారేస్తున్నారు. నాగ్ కోసం ప్రవీణ్ ఓ కొత్త కథ రాశాడని చెబుతున్నారు. ఈ మూవీ కూడా ఇన్‌కమ్ ట్యాక్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందట. పన్నులు చెల్లించాల్సిన అవసరం, ప్రజాధనాన్ని సరిగ్గా వినియోగించాలన్న కాన్సెప్ట్‌తో ప్రవీణ్ పక్కా స్క్రిప్టు సిద్ధం చేశాడని చెబుతున్నారు. ‘గరుడవేగ’ తర్వాత అతను రెండేళ్ల పాటు ఈ స్క్రిప్టు పై వర్క్ చేశాడని తెలుస్తోంది. ప్రముఖ నిర్మాతలు నారాయణ్ దాస్ నారంగ్, రామ్ మోహన్ రావు, శరత్ మరార్ భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మించబోతున్నారు. ఇతర తారాగణం, సాంకేతిక సిబ్బంది వివరాలు త్వరలోనే వెల్లడించే అవకాశం కనిపిస్తోంది.