Naga Vamsi comments on Kingdom: ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన చిత్రాల్లో ఒకటి కింగ్డమ్(Kingdom Movie). విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), గౌతమ్ తిన్ననూరి(Gowtham Tinnanuri) కాంబినేషన్ లో నాగవంశీ నిర్మాత గా వ్యవహరించిన ఈ చిత్రానికి ఎబోవ్ యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ పరంగా యావరేజ్ రేంజ్ కి స్థిరపడింది. కానీ వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో డీలాపడిన విజయ్ దేవరకొండ కెరీర్ ని మాత్రం ఈ చిత్రం కాస్త కాపాడింది అనే చెప్పొచ్చు. ఓటీటీ లో కూడా డీసెంట్ స్థాయి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం ఫలితం గురించి రీసెంట్ గానే నిర్మాత నాగవంశీ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన నిర్మాత గా వ్యవహరించిన ‘మాస్ జాతర’ చిత్రం నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా ప్రొమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ‘కింగ్డమ్’ ప్రస్తావన రిపోర్టర్ తీసుకొని రాగా, నాగవంశీ సమాధానం చెప్పాడు.
మీ గత రెండు సినిమాలు కమర్షియల్ గా ఆడలేదు కదా అని అడిగిన ప్రశ్నకు నాగవంశీ సమాధానం చెప్తూ ‘కింగ్డమ్ చిత్రం ఫెయిల్ అయ్యిందని ఎలా చెప్తారు అండీ..?, నార్త్ అమెరికా లో 1.8 మిలియన్ డాలర్లు చేసింది, 1 మిలియన్ డాలర్లు ప్రీమియర్ షోస్ నుండి రాబట్టింది, నైజాం లో 10 నుండి 11 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టింది, ఇలాంటి సినిమాని ఫెయిల్యూర్ అని మీరు ఎలా అంటారు?. విజయ్ దేవరకొండ గారి గత సినిమాలు ‘ది ఫ్యామిలీ స్టార్’, ‘ఖుషి’ చిత్రాల కలెక్షన్స్ ని చూసి, కింగ్డమ్ కలెక్షన్స్ ని చూడండి, మీకే అర్థం అవ్వుధి. వంద రూపాయలకు ఒకరు సినిమా కొంటే, ఈ చిత్రం 80 రూపాయిల వరకు రాబట్టింది, నేను జీఎస్టీ ఇచ్చిన వాళ్ళు కొంతమంది సేఫ్ అయ్యారు, మరికొంతమంది 10 శాతం నష్టాలతో ఉన్నారు’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇంకా ఆయన కొనసాగిస్తూ ‘జెర్సీ లాంటి సినిమా తర్వాత గౌతమ్ దర్శకత్వం వహించిన సినిమా, విజయ్ దేవరకొండ హీరో, ప్రమోషనల్ కంటెంట్ కూడా బాగా హిట్ అయ్యి అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఆ అంచనాలను అందుకోవడం లో ఈ సినిమా ఫెయిల్ అయ్యింది కానీ, కమర్షియల్ గా ఎబోవ్ యావరేజ్ రేంజ్’ అంటూ చెప్పుకొచ్చాడు నాగవంశీ. ఇకపోతే రవితేజ తో తీసిన ‘మాస్ జాతర’ చిత్రం చాలా బాగా వచ్చిందని, కమర్షియల్ మూవీ లవర్స్ కి ఈ చిత్రం ఒక విజువల్ ఫీస్ట్ లాగా ఉంటుందని, కచ్చితంగా రవితేజ గారి కం బ్యాక్ సినిమాగా ఈ చిత్రాన్ని పరిగణించొచ్చు అని చెప్పుకొచ్చాడు నాగవంశీ. మరి ఆ రేంజ్ లో సినిమా ఉందో లేదో తెలియాలంటే మరో నాలుగు రోజులు ఆగాల్సిందే.
