Naga Chaitanya Samantha Divorce అక్కినేని ఫ్యామిలీలో మొదటి పెళ్లి కలిసి రావడం లేదా? అటు నాగార్జున జీవితంలో.. ఇటు ఆయన కుమారులు నాగచైతన్య, అఖిల్ జీవితంలోనూ మొదటి పెళ్లి విషాదాంతంగా ముగిసింది. నాగార్జున తొలి పెళ్లి విడాకులకు దారితీయగా.. ఇప్పుడు నాగచైతన్యది అలానే అయ్యింది. ఆయన చిన్న కుమారుడు అఖిల్ పెళ్లి కూడా కాకుండానే నిశ్చితార్థంతోనే ఆగిపోయింది. ఇలా వారి కుటుంబంలో ‘పెళ్లి’ అనే ముఖ్యమైన ఘట్టం వారికి కలిసి రావడం లేదని తెలుస్తోంది. ఇదో శాపంగా పరిణమించిందని అంటున్నారు.
ఏఎన్ఆర్ నటవారసుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున ఇండస్ట్రీలో ఇప్పుడు అగ్రహీరోల్లో ఒకరిగా ఎదిగాడు. ఈ క్రమంలోనే టాలీవుడ్ బడా నిర్మాత రామానాయుడు కూతురుతో పెద్దలు కుదిర్చిన పెళ్లిని చేసుకున్నాడు. వెంకటేశ్, సురేష్ బాబులకు నాగార్జున బావ అయిపోయాడు. అంతా బాగుందనుకున్నారు. కానీ నాగచైతన్య పుట్టాక నాగార్జున దంపతులు విడిపోయారు. ఆ తర్వాత రామానాయుడు కూతురు వేరొకరిని పెళ్లి చేసుకొని సెటిల్ కాగా.. నాగార్జున సైతం సినిమాల్లో పరిచయమైన ‘అమల’ను రెండో పెళ్లి చేసుకొని ఆ బంధాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. నాగార్జున జీవితంలో మొదటి పెళ్లికి గుర్తుగా నాగచైతన్య మిగిలాడు.
ఇక తాజాగా నాగచైతన్య జీవితంలోనూ తొలి పెళ్లి క్యాన్సిల్ కావడం విషాదం నింపింది. తండ్రి విడాకుల వారసత్వం కుమారుడు నాగచైతన్యకు కొనసాగడం అభిమానులను శోకసంద్రంలో ముంచెత్తుతోంది. నాగచైతన్య కూడా ఎంతో ముచ్చటపడి కొన్నేళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంతతో విడిపోయాడు. ఈరోజు విడాకుల ప్రకటనను ఇద్దరూ చేశారు. దీంతో ఇండస్ట్రీ వర్గాలు షాక్ అయ్యాయి. ఇన్నాళ్లు ఊహాగానాలు రాగా.. తాజాగా అధికారిక ప్రకటన వెలువడింది.
ఇక సినిమాల్లో హీరోగా సెటిల్ కాకముందే నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ ప్రేమలో పడ్డాడు. హైదరాబాద్ కు చెందిన బడా పారిశ్రామికవేత్త జీవీకే మనవరాలు శ్రియా భూపాల్ తో నిశ్చితార్థం కూడా ఘనంగా జరిగింది. ఇక వివాహానికి కూడా రెడి అని ప్రకటించారు. కానీ పెళ్లికి ముందే అఖిల్, కాబోయే భార్య శ్రియాభూపాల్ కు మధ్య విభేదాలు తలెత్తి వీరి పెళ్లి క్యాన్సిల్ అయ్యింది.
నాగార్జున కుమారులు ఇద్దరూ కూడా సినిమాల్లో తండ్రిలాగా సెటిల్ కాలేదు. అటు చైతన్య.. ఇటు అఖిల్ లు సినిమాల్లో నిలుదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవలే ‘చైతన్య’కు లవ్ స్టోరీతో హిట్ దక్కింది. ఆ విజయాన్ని ఆస్వాదించే లోపే చైతన్య-సమంత విడాకుల ప్రకటన చేయడం విషాదం నింపింది. బహుశా ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఈ విడాకుల ప్రకటన చేద్దామని ఆగినట్టున్నారు. కానీ మొత్తానికి అక్కినేని నాగార్జున కుటుంబంలో ఆయన ఇద్దరు కుమారుల జీవితాల్లో ఈ మరకలు ఎప్పటికీ వారిని వెంటాడుతూనే ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.