Uttarandhra Accent: ఉత్తరాంధ్ర భాష, యాస వేరుగా ఉంటుంది. ఈ ప్రాంతీయులు ఎక్కడ ఉన్నా ఇట్టే గుర్తుపట్టగలరు. ఉమ్మడి ఏపీలో అయినా, నవ్యాంధ్రప్రదేశ్ లో అయినా ఉత్తరాంధ్ర మాండలికం ప్రత్యేకమే.ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం వాసులు మాట్లాడే భాష చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్లినా వీరు వాడుక భాషను మాట్లాడడం మానరు. అటువంటి ఉత్తరాంధ్ర మాండలికముతో సాగే సినిమాలు రూపొందడం విశేషం. గతంలో రాయలసీమ నేపథ్యంలో ఉన్న చిత్రాలు ఎక్కువగా వచ్చేవి. అటు తరువాత తెలంగాణ ఊపు కనిపించింది. ఇప్పుడు మాత్రం ఉత్తరాంధ్ర వంతు వచ్చింది.
ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఓ చిత్రం రూపొందించనున్న సంగతి తెలిసిందే. ఇది పూర్తిగా ఉత్తరాంధ్ర నేపథ్యం లో సాగే చిత్రం. ఓ ఆటను ప్రధానంగా చేసుకొని బలమైన భావోద్వేగాలతో నిండిన సినిమాగా దీన్ని చూపే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడే నూతన నటీనటుల కోసం నేరుగా ఆ మూడు జిల్లాలకు వెళ్లి దర్శకుడు ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు. నటులను ఎంపిక చేస్తున్నారు. మరోవైపు హీరో రామ్ చరణ్ సైతం ఉత్తరాంధ్ర యాసపై శిక్షణ తీసుకుంటున్నారు. ఈ వేసవి నుంచి సినిమా చిత్రీకరణ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
క్రియేటివ్ డైరెక్టర్ చందు మొండేటి ఉత్తరాంధ్ర కథ నేపథ్యం ఉన్న ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నాగచైతన్య హీరోగా రూపొందుతున్న ఈ సినిమా పేరును తండేల్ గా నిర్ణయించారు. సాయి పల్లవి హీరోయిన్ కాగా.. ఇది పూర్తిగా ఉత్తరాంధ్ర మండలికంతో సాగే చిత్రంగా తెలుస్తోంది. పాకిస్తాన్ కోస్ట్ గార్డులకు చిక్కిన ఓ మత్స్యకారుడి ప్రేమ కథను అందంగా తీర్చిదిద్దుతున్నారు. మొత్తం ఈ సినిమాలో పాత్రలు ఉత్తరాంధ్ర మాండలికంతో సాగుతాయని తెలుస్తోంది.
ఉత్తరాంధ్రకు చెందిన దర్శకుడు కద్దాల కరుణ కుమార్. హీరో వరుణ్ తేజ్ తో మట్కా అనే సినిమా రూపొందిస్తున్నారు. ఇది కూడా ఉత్తరాంధ్ర యాసతో కూడుకున్న చిత్రంగా తెలుస్తోంది. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రూపొందించనున్నట్లు తెలుస్తోంది. సహజంగా ఈ ప్రాంతానికి చెందిన దర్శకుడు కావడంతో.. ఉత్తరాంధ్ర యాస సహజ శైలిలో వచ్చే అవకాశం ఉంది. గతంలో ఇదే దర్శకుడు పలాస సినిమాను రూపొందించారు. ఆ సినిమా సైతం ఉత్తరాంధ్ర యాసలోనే సాగింది.
మరోవైపు అనుష్క ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఇది కూడా పూర్తిగా ఉత్తరాంధ్ర యాసలోనే రూపొందించనున్నట్లు సమాచారం. తనకు జరిగిన అన్యాయం పై యువతి చేసే పోరాటంలో భాగంగా.. ఉత్తరాంధ్ర మాండలికంతో సినిమా సాగుతుందని తెలుస్తోంది. మొత్తానికైతే ఉత్తరాంధ్ర యాసలో వరుసగా సినిమాలు రావడం విశేషం.