Mirzapur: బాలీవుడ్లో మరో విషాదం చోటుచేసుకుంది. మిర్జాపూర్ వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైన నటుడు బ్రహ్మ స్వరూప్ మిశ్రా అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. ముంబయిలోని వర్సోవా సొసైటీలో అద్దెకుంటున్న ఓ గదిలో ఓ కుళ్లిన శవాన్ని పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత గుర్తులను బట్టి.. అతను బ్రహ్మ స్వరూప్ మిశ్రాగా గుర్తించారు. మీర్జాపూర్లో మున్నాభాయ్ అనుచరుడు లలిత్ పాత్తరలో నటించారు బ్రహ్మ స్వరూప్. తనదైన కామెడీతో ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తాడు.

దీంతో పాటు, బాలీవుడ్లో పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సూపర్30, దంగల్ వంటి సినిమాల్లోనూ కనిపించాడు. బ్రహ్మ స్వరూప్ గత 4 ఏళ్లుగా వర్సోవా సొసైటీలోనే నివాసముంటున్నాడు. అయితే గత కొన్ని రోజుల నుంచి అతను ఇంటినుంచి బయటకి రాలేదని స్థానికులు తెలుపుతున్నారు. బుధవారం అతను అద్దెకుంటున్న గది నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఇంటికి తాళం వేయడాన్ని గుర్తించారు. డూప్లికేట్ తాళం సాయంతో ఇంటి తలుపును తెరిచి చూసిన పోలీసులు.. బ్రహ్మ స్వరూప్ చనిపోయి ఉండటం చూశారు. ప్రస్తుతం ఆయన మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఈ విషయాన్ని ఆ.న సోదడురు సందీప్‌కు తెలిపారు.
కాగా, బ్రహ్మ స్వరూప్ గుండెపోటుతే మరణించే అవకాశముందని.. రూమ్‌లో ఒక్కడే ఉండటం వల్ల ఎవ్వరికీ ఈ విషయం తెలియలేదని.. ఈ ఘటన జరిగిన మూడురోజులు అయ్యుండచ్చని వైద్యులు చెబుతున్నారు. మిశ్రా మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మిర్జాపూర్‌లో అతనితో కలిసి నిటించిన దివ్యేందు శర్మ.. సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. మిశ్రాతో కలిసున్న ఫొటోను పంచుకుంటూ ‘ మన లలిత్ ఇక లేడు. బ్రహ్మ స్వరూప్ మిశ్రా ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిద్దాం’ అని నివాళి తెలిపారు.