
దేశంలో లాక్డౌన్ కారణంగా సినిమా థియేటర్లు మూతపడగా, షూటింగులు వాయిదా పడ్డాయి. దీంతో ఇండస్ట్రీని నమ్ముకొని జీవిస్తున్న వేలాది మంది కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కార్మికులను ఆదుకునేందుకు ఆయా చిత్రసీమలోని పెద్దలు ముందుకొస్తున్నారు. కాగా టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ‘సీసీసీ మనకోసం’ ఛారిటీని ఏర్పాటు చేసి కార్మికులను ఆదుకుంటున్నారు. ‘సీసీసీ మనకోసం’ ఛారిటీకి సెలబ్రెటీలు తమకు తోచినంత విరాళం అందించి కార్మికులకు అండగా నిలిచారు. ఇదిలా ఉంటే నేడు మెగాస్టార్ ఆధ్వర్యంలో సినీపెద్దలంతా బేటి అయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం దేశంలో లాకౌన్ 4.0 కొనసాగుతోంది. మే 31వరకు లాక్డౌన్ కొనసాగునుంది. అయితే లాక్డౌన్ 3.0లో సినిమా షూటింగులకు అనుమతి వస్తుందని అందరూ భావించారు. అయితే అలాంటివేమీ జరుగలేదు. దీంతో టాలీవుడ్ పెద్దలు మెగాస్టార్ తో నేడు బేటీ అయి లాక్డౌన్లో 4.0 తర్వాత షూటింగులు ప్రారంభించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది దానిపై చర్చించినట్లు తెలుస్తోంది. లాక్డౌన్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగులు ప్రారంభించాలి? ఇండస్ట్రీని కార్మికులను ఎలా ఆదుకోవాలి? హీరో హీరోయిన్ల రెమ్యూనేషన్ తగ్గింపు? థియేటర్లను ఎలా తెరిపించాలి? అనే అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది.
ఈ బేటిలోని అంశాలను తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే షూటింగులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈమేరకు మెగాస్టార్ ఆధ్వర్యంలో సినీ పెద్దలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిచేందుకు సిద్ధపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పనిలో పనిగా భారత ప్రధాని మోదీని కలిసి సినీ ఇండస్ట్రీని ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని కోరనున్నారని తెలుస్తోంది. లాక్డౌన్ ఇలానే కొనసాగితే ఇండస్ట్రీకి, కార్మికులకు ఎదురయ్యే ఇబ్బందులను వారికి వివరించాలని మెగాస్టార్ భావిస్తున్నారట. ఈమేరకు తగిన కార్యచరణ రూపొందించి త్వరలోనే ప్రధాని మోదీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను సీని పెద్దలు కలువనున్నారట. ఈమేరకు ఇప్పటికే వారికి అపాయిమ్మెంట్ కోరినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై టాలీవుడ్ ఇండస్ట్రీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇన్నాళ్లూ షూటింగుల విషయంలో స్తబ్ధుగా ఉన్న చిత్రసీమ లాక్డౌన్లో సినిమాలకు కూడా పర్మిషన్ ఇవ్వాలని కోరుతోంది. కేంద్ర మార్గదర్శకాలతో షూటింగులు ప్రారంభించేందుకు తాము సిద్ధమేనంటూ ప్రకటిస్తున్నారు. ఈనేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు షూటింగుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో వేచి చూడాల్సిందే..!