Mask Girl Review: వెబ్ సీరీస్ : మాస్క్ గర్ల్
ఓటీటీ ప్లాట్ఫారం : నెట్ ఫ్లిక్స్
ఈ డార్క్ సౌత్ కొరియర్ నెట్ ఫ్లిక్స్ సిరీస్ ప్రస్తుతం ప్రపంచంలో తెలియకుండా చాప కింద నీరులా వ్యాపిస్తున్న మానసిక రుగ్మతల గురించి కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. సమాజం అందంగా ఉండాలి అంటే దానికి నాంది ఇంటి నుంచే మొదలవ్వాలి. చిన్నతనంలో పిల్లల బాధ్యత తీసుకోవలసిన తల్లిదండ్రులు వాళ్లపై తీవ్ర ఒత్తిడి కలిగించడమే కాకుండా అనారోగ్యకరమైన వాతావరణం సృష్టించడం వల్ల పెరిగి పెద్దయ్యాక అది వాళ్ళని ఎలా దెబ్బతీస్తుంది అని అంశంపై ఈ సిరీస్ ను తెరకెక్కించారు.
కథ:
ఒక ఆఫీసులో మామూలు ఉద్యోగిగా పని చేసే ఒక అమ్మాయి ఎప్పుడు తన బాహ్య సౌందర్యం గురించి ఇన్ సెక్యూర్డ్ గా ఉంటుంది. దీనికి కారణం చిన్నతనంలో ఆమె అనుభవించిన ట్రామా. అయితే ఆమె దాన్ని అధిగమించడం కోసం నైట్ టైం ఒక మాస్క్ వేసుకొని ఇంటర్నెట్లో ఫేమస్ సెలబ్రిటీగా మారుతుంది. అనూహ్యంగా పాపులారిటీ తెచ్చుకున్న ఈ మాస్క్ గర్ల్ కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు ఎదుర్కోవడం, ఆమెతోపాటు ఆమెకు సంబంధించిన వారు కూడా చిక్కుల్లో పడడం మొదలవుతుంది.
మొత్తం ఏడు ఎపిసోడ్స్గా సాగే ఈ సీరియస్ లో ప్రతి ఎపిసోడ్లో తమ పాస్ట్ కారణంగా ప్రస్తుతం జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వ్యక్తుల గురించి ఎంతో అద్భుతంగా చూపించడం జరిగింది. భిన్న ధ్రువాలుగా ఉన్న ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా అనుభవించే కామన్ కాన్సెప్ట్ చిన్నతనం నుంచి జరిగినటువంటి ఎమోషనల్ డ్యామేజ్. హెల్తి పేరెంటింగ్ అనేది ఒక హెల్ది సొసైటీకి ఎంత ఇంపార్టెంట్ అనే విషయాన్ని హైలెట్ చేస్తూ ఈ సిరీస్ ముందుకు సాగుతుంది.
సమీక్ష:
సమాజంలో అందం గురించి ఉన్నటువంటి భిన్నాభిప్రాయాలు ఒక మనిషి జీవితంలో ఎటువంటి తుఫాను తీసుకువస్తాయో ఈ సీరీస్ లో చూడొచ్చు. ప్రస్తుతం సొసైటీలో అందానికి ఇస్తున్న ప్రాముఖ్యత క్యారెక్టర్ కి ఇవ్వడం లేదు.. ఇదే పరిస్థితి కొనసాగితే అది వ్యక్తి జీవనంపై ఎటువంటి పెను మార్పులు తీసుకువస్తుంది అనే విషయాన్ని కూడా ఈ సిరీస్ లో అద్భుతంగా చూపించారు. చిన్నతనం నుంచి మానసిక సంఘర్షణకు గురి అయిన వాళ్ళు పెద్దయ్యాక తమ జీవితం నాశనం చేసుకోవడమే కాకుండా ఇతరుల జీవితాలపై కూడా ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తారో వీటిల్లో మనం గమనించవచ్చు. అన్ హెల్తి పేరెంటింగ్ ఒక బిడ్డ భవిష్యత్తు తో పాటు సమాజాన్ని కూడా ఎలా నాశనం చేస్తుందో ఈ సిరీస్ లో తెలుసుకోవచ్చు.
కిమ్ మో-మి అనే అమ్మాయికి విపరీతమైన క్రేజ్ తెచ్చుకోవాలి అన్న ఒకే ఒక కోరిక ఉంటుంది. కానీ చిన్నప్పటి నుంచి ఆమెను ఆమె తల్లి కానీ చుట్టూ ఉన్న సొసైటీ కానీ ఎవరు పెద్దగా పట్టించుకోరు. ఇన్ఫీరియారిటీతో బాధపడే ఆమె ఇంటర్నెట్ను తన ఫ్రస్ట్రేషన్ తీర్చుకోవడానికి ఒక మీడియం గా వాడుకుంటుంది. మాస్క్ గర్ల్ గా కొనసాగుతున్న ఆమెను ఒక ఫాలోవర్ మోసం చేసి ఐడెంటిటీ బయట పెట్టేలా చేస్తాడు.దీనివల్ల ఆమెతోపాటు ఆమె కూతురు, తల్లి, స్నేహితులు ఇలా అందరూ చిక్కుల్లో ఇరుక్కుంటారు.
తీర్పు:
ఒక మనిషికి సామాజిక స్పృహ ఎంత ఉండాలో… అంతకంటే ఎక్కువగా కుటుంబానికి సంబంధించిన బంధాలు ,బాంధవ్యాలకు విలువ ఇచ్చే స్పృహ కూడా ఉండాలి అనేది ఈ వెబ్ సిరీస్ కన్వే చేసే మెసేజ్. పక్కన వాళ్ళను పట్టించుకోకుండా చిన్నచూపు చూడడం వల్ల వాళ్ల జీవితంలో మనం ఎటువంటి చెడు ప్రభావాన్ని చూపిస్తున్నామో చాలా సందర్భాలలో మర్చిపోతాం. మనం మనల్ని అవతలి వాళ్ళు ఎలా చూడాలనుకుంటామో, మనం కూడా అవతలి వాళ్ళని అలాగే చూస్తే సమాజంలో ఎటువంటి ఇబ్బంది రాదు అనేది ఈ సిరీస్ చూసి నేర్చుకోవాల్సిన విషయం.
రేటింగ్. 3.5 /5