
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలు టాలీవుడ్ లో కాకరేపుతున్నాయి. దక్షిణాది దిగ్గజ నటుడు ప్రకాష్ రాజ్ ఈ ఎన్నికల బరిలో అధ్యక్షుడిగా నిలబడడంతో ఎన్నికలు ఆసక్తి రేపుతున్నాయి. పైగా ఈసారి తన ప్యానెల్ లో సమర్థులు, సినీ ప్రముఖులను తీసుకోవడంతో బలంగా తయారైంది.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ప్రతీసారి టాలీవుడ్ ప్రముఖుల్లో చిచ్చుకు కారణమవుతున్నాయి.తెలుగు సినీ పరిశ్రమలో ఈ రసవత్తరపోరులో గెలుపు ఎవరిది? అనేది ఆసక్తి రేపుతోంది.
ఇప్పటికే అధ్యక్ష పోటీలో బరిలోకి దిగుతున్నట్లు నటుడు ప్రకాష్ రాజ్ చేసిన ప్రకటన హీట్ పెంచింది. ఆయనకు పోటీగా హీరో మంచు విష్ణు, నటీమణులు జీవితా రాజశేఖర్, హేమ లు సైతం అధ్యక్ష బరిలో దిగుతున్నట్టు ప్రకటించారు.
దీంతో ‘మా’ ఎన్నికల్లో తొలిసారి ఈసారి నలుగురు పోటీ పడుతుండడం విశేషంగా మారింది. ఇక ఈ ఎన్నికల్లో పాల్గొనే మొత్తం 27 మందితో ప్రకాష్ రాజ్ జాబితాను విడుదల చేశారు. అందులో హీరో శ్రీకాంత్, నటుడు బెనర్జీ, సాయి కుమార్, నిర్మాత బండ్ల గణేష్, జబర్ధస్త్ నుంచి సుడిగాలి సుధీర్, అనసూయ, జయసుధ లాంటి వారికి చోటు ఇచ్చి అందరినీ ఇండస్ట్రీలోని అన్ని విభాగాల నుంచి అందరినీ టీంలో చేర్చుకొని సమపాళ్లతో చూస్తున్నట్టు ప్రకాష్ రాజ్ ప్రకటించారు.
మా శ్రేయస్సు కోసం నిర్మాణాత్మక ఆలోచనలను ఆచరణలో పెట్టే దిశగా నటీనటుల బాగోగుల కోసం మా టీం ఏర్పాటు చేశారు. పదవులు కాదు.. పనులు మాత్రమే చేయడం కోసం ఈ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నా అని ప్రకాష్ రాజ్ తెలిపారు.