తెలుగు వెండి తెర పై వాణిశ్రీ ఓ వెలుగు వెలుగుతున్న రోజుల అవి. ఆమె డేట్లు కోసం హీరోలు ఎదురుచూస్తోన్న రోజులు అవి. కానీ ఆమె అంటే కృష్ణకు అసలు పడదు. అందుకే కృష్ణ సినిమాలో వాణిశ్రీని తీసుకోరు. అలాగే వాణిశ్రీ కూడా కృష్ణ అంటే డేట్లు ఇవ్వదు. ఇవ్వన్నీ దర్శకుడు పి..చంద్రశేఖరరెడ్డికి బాగా తెలుసు. ఆయన ఒక కథ రాసుకున్నారు. హీరో కృష్ణ ఎదురుగా కూర్చుని కథ చెప్పడానికి సన్నద్ధం అవుతున్నారు.
కృష్ణ మాట్లాడుతూ.. ‘నాకు మీ పై గౌరవం ఉంది. కథ విషయంలో నేను ఎక్కవగా ఇన్ వాల్వ్ కాను, లైన్ చెప్పండి’ అంటూ ముగించారు. చంద్రశేఖరరెడ్డి కథ చెప్పారు. ‘అరె కథ చాల బాగుంది. హీరో పాత్ర కంటే హీరోయిన్ పాత్ర నాకు చాల బాగా నచ్చింది. ఇంతకీ హీరోయిన్ గా ఎవరిని అనుకుంటున్నారు?’ అని డౌట్ గా అడిగారు కృష్ణ. వాణిశ్రీని అనుకుంటున్నాను అని దైర్యంగా చెప్పలేకపోయారు పి.సి.రెడ్డి.
అసలు కృష్ణకు, వాణిశ్రీకి మధ్య మాటలు లేకపోవడానికి కారణం ఏమిటంటే.. తెలుగు సినీ కళాకారులు వైజాగ్ లో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఆ సమయంలో తమ ‘దేవదాసు’ సినిమా గురించి వాణిశ్రీ అనవసరంగా మాట్లాడి తమను అవమానించింది అని కృష్ణ, విజయనిర్మల ఆగ్రహించారు. అది తెలిసి వాణిశ్రీ కూడా వారిపై అంతే సీరియస్ గా తిడుతూ స్పందించారు.
ఈ క్రమంలోనే కృష్ణ, వాణిశ్రీ మీద ఆర్టిస్టు అసోసియేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు. అప్పటినుండి మేకర్స్ కూడా కృష్ణ సినిమాల్లో వాణిశ్రీని తీసుకోలేదు. తెలియకుండానే కృష్ణ -వాణిశ్రీల మధ్య దూరం బాగా పెరిగింది. కట్ చేస్తే.. తనకు కథ చెప్పిన పి.సి.రెడ్డితో నాకు హీరోయిన్ పాత్ర బాగా నచ్చింది. ఆ పాత్రలో వాణిశ్రీని తీసుకోండి. ఆ పాత్రకు ఆమె మాత్రమే న్యాయం చేయగలదు అని చెప్పి, తనను తిట్టిన హీరోయిన్ కి ఛాన్స్ ఇప్పించారు కృష్ణ.
కృష్ణ మొదటినుండి వ్యక్తిగత జీవితంలోని గొడవలను వృత్తి జీవితంలోకి తీసుకు రారు. వాణిశ్రీ కూడా కృష్ణ తనను రికమండ్ చేశాడని తెలియడంతో వెంటనే డేట్లు ఇచ్చి ఆ సినిమా చేసింది. ఆ సినిమానే ‘జన్మజన్మల బంధం’. కృష్ణ, వాణిశ్రీ షూటింగ్ సమయంలో పాత్రల్లో ఎంతో లీనమై నటిస్తూనే.. షాట్ పూర్తి కాగానే వారిద్దరూ సంబంధం లేదన్నట్టు చెరో పక్క కూర్చునేవారు.