ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై రోజురోజుకు రకరకాల పుకార్లు వ్యాపిస్తున్నాయి. ఆదివారం ఆయనకు ఏ ప్రమాదం లేదని చెప్పినా సోమవారం మాత్రం ఆయన ఎడమ కన్ను చూపు కోల్పోయినట్లు వార్తలు రావడం సంచలనం సృష్టిస్తోంది. విజయవాడ నుంచి చిత్తూరుకు స్నేహితుడితో కలిసి కారులో వెళ్తున్న కత్తి మహేశ్ రెండు రోజుల క్రితం నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.
ఈ ఘటనలో కత్తి మహేశ్ కు తల, ముక్కు, కంటికి తీవ్ర గాయాలైనట్లు వైద్యులు చెప్పారు. వెంటనే ఆయన్ను నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. అయితే నిన్న మాత్రం ఆయన ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా లేదని చెప్పినా ఇంతలోనే ఆయన కంటిచూపు కోల్పోయినట్లు చెప్పడం గమనార్హం.
సోమవారం రెండు కళ్లకు ఆపరేషన్ చేస్తామని వైద్యులు చెప్పారు. కానీ ఆయన ఎడమ కన్ను చూపు కోల్పోయినట్లు చెబుతున్నారు. దీంతో ఆయన మేనమామ శ్రీరాములు ఈ విషయం మీడియాకు వెల్లడించారు.తలలో తీవ్ర రక్తస్రావం జరగకపోవడంతో ప్రాణాపాయం తప్పినట్లు వైద్యులు చెప్పారు. మహేశ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.