
Vidya Balan : తమిళనాడుకు చెందిన విద్యాబాలన్ పుట్టి పెరిగింది మాత్రం ముంబైలో. చదువుకునే రోజుల్లోనే నటనపై ఆసక్తి పెంచుకున్నారు. సినిమా ప్రయత్నాలు చేసి హీరోయిన్ గా సక్సెస్ అయ్యారు. విద్యాబాలన్ పరిశ్రమకు వచ్చి రెండు దశాబ్దాలు అవుతోంది. ఆమె మొదటి చిత్రం భాలో తెకో 2003లో విడుదలైంది. ఇది ఓ బెంగాలీ చిత్రం. రెండేళ్ల గ్యాప్ అనంతరం 2005లో పరిణీత చిత్రంతో బాలీవుడ్ లో అడుగుపెట్టారు. పరిణీత విద్యాబాలన్ కి గుర్తింపు తెచ్చింది. గొప్ప నటిగా ప్రశంసలు అందుకున్నారు. సంజయ్ దత్, సైఫ్ అలీ ఖాన్ హీరోలుగా నటించారు. అయితే స్టార్ హీరోయిన్ హోదా ఆమెకు దక్కలేదు.
ఒక దశలో ఆమె బాడీ షేమింగ్ కి గురయ్యారు. పరిశ్రమ వర్గాలతో పాటు ఆడియన్స్ ఆమె శరీరం మీద కించపరిచే వ్యాఖ్యలు చేశారు. విద్యాబాలన్ కెరీర్ డర్టీ పిక్చర్ కి ముందు ఆ తర్వాత అని చెప్పొచ్చు. 2011లో విడుదలైన డర్టీ పిక్చర్ విద్యాబాలన్ ఇమేజ్ పూర్తిగా మార్చేసింది. అంతకు ముందు ఆమె చేసిన పాత్రలకు భిన్నంగా గ్లామర్ రోల్ చేశారు. తెలుగు నటి సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన డర్టీ పిక్చర్ మూవీలో విద్యాబాలన్ బోల్డ్ సన్నివేశాల్లో నటించారు. విపరీతమైన స్కిన్ షో చేశారు.
అప్పట్లో డర్టీ పిక్చర్ దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. డర్టీ పిక్చర్ అనంతరం విద్యాబాలన్ కి విరివిగా ఆఫర్స్ వచ్చాయి. కాగా ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంతో తెలుగులో అడుగుపెట్టారు. ఈ సెన్సేషనల్ బయోపిక్ లో విద్యాబాలన్ ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్ర చేశారు. ఎన్టీఆర్ బయోపిక్స్ గా తెరకెక్కిన రెండు చిత్రాలు ఆదరణ పొందలేదు. దీంతో ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. ప్రస్తుతం బాలీవుడ్ లో విద్యాబాలన్ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో పాటు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తున్నారు.
2012లో విద్యాబాలన్ నిర్మాత సిద్ధార్థ్ రాయ్ కపూర్ ని వివాహం చేసుకున్నారు. ఈ వివాహం జరగడానికి కారణం ఎవరో? అసలు ఏం జరిగిందో? తాజాగా బయటపెట్టారు విద్యాబాలన్. సిద్ధార్థ్ రాయ్ కపూర్ తో తన పెళ్ళికి కర్త, కర్మ, క్రియ నిర్మాత కరణ్ జోహార్ అట. వారిద్దరికీ ఒక్కటి చేయాలనే ఉద్దేశంతో ఆయన పెద్ద సెటప్ ఏర్పాటు చేశాడట. ఒక ప్రైవేట్ పార్టీకి సిద్ధార్థ్, విద్యాబాలన్ లను పిలిచిన కరణ్ జోహార్ వారిద్దరూ కలిసి ఏకాంతంగా కొంత సమయం గడిపేలా ఏర్పాట్లు చేశాడట. ఆ పరిచయమే మా ప్రేమకు కారణమైంది. ఆపై పెళ్లికి దారి తీసిందని విద్యాబాలన్ చెప్పారు. మా పెళ్ళికి కరణ్ జోహార్ పెళ్లిళ్ల పేరయ్య అవతారం ఎత్తాడని సరదాగా చెప్పింది. కాగా హీరోయిన్ ప్రియమణికి విద్యాబాలన్ కజిన్ అవుతారు.