
Jr.NTR: జూనియర్ ఎన్టీఆర్ కి అభిమానుల పై ప్రత్యేక అభిమానం ఉంటుంది. వారి పట్ల మనసెరుగుతూ నడుచుకోవడంలో మిగిలిన హీరోల కంటే ఎన్టీఆర్ ఎప్పుడు ముందు ఉంటాడు. ముఖ్యంగా ఏ అభిమాని అయినా కష్టాల్లో ఉన్నాడని తెలిస్తే తారక్ కరిగిపోతాడు. తాజాగా తన అభిమాని చావుబతుకుల్లో ఉన్నాడని తెలిసి బాధ పడిన తారక్, ఆ అభిమానికి వీడియో కాల్ చేసి పలకరించి అతనిలో మనో ధైర్యాన్ని పెంచి, అతడిని అనందంలో ముంచెత్తాడు.
ఇంతకీ ఆ అభిమాని ఎవరు అంటే.. తూర్పు గోదావరి జిల్లా రాజోలుకు చెందిన కొప్పాడి మురళి అనే వ్యక్తి. మురళి, జూనియర్ ఎన్టీఆర్(Jr.NTR)కు వీరాభిమాని. ఎన్టీఆర్ సినిమాలు అంటే మురళికి పిచ్చి. అయితే, ఇటీవల మురళి ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హాస్పిటల్ లో ప్రాణం కోసం పోరాడుతున్నాడు. కానీ మురళి పరిస్థితి రోజురోజుకు మరింతగా విషమిస్తూ ఉంది.
ఈ క్రమంలో డాక్టర్లు మురళి కోరికలు, ఇష్టాయిష్టాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న క్రమంలో.. ఎన్టీఆర్ పై ఉన్న అభిమానం గురించి తెలిసింది. మురళి కూడా చనిపోయే లోపు ఎన్టీఆర్‌తో మాట్లాడాలని ఉందని తెలిపాడు. అయితే ఈ విషయాన్ని ఎన్టీఆర్ అభిమాన సంఘాల దృష్టికి తీసుకువెళ్తే.. వాళ్ళు ఎన్టీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.
విషయం తెలిసిన ఎన్టీఆర్ వెంటనే.. షూట్ కి గ్యాప్ ఇచ్చి.. తన అభిమానికి వీడియో కాల్ చేసి, అతని పరిస్థితి చూసి ఎమోషనల్ అయ్యారు. అనంతరం డాక్టర్లు, కుటుంబసభ్యులను పలకరించి.. ‘మురళికి ఏమి కాదు అని, నేను ఉన్నాను.. త్వరలో మనం కలుద్దాం’ అని ఎన్టీఆర్ ధైర్యం చెప్పారు. అయితే ఎన్టీఆర్ తో మాట్లాడిన తర్వాత మురళి ఆరోగ్యం ఆశాజనంగా ఉండటం విశేషం.
గతంలో ఎన్టీఆర్ ఇలాగే చావుబతుకుల్లో ఉన్న ఓ అభిమానితో మాట్లాడాక, ఆ అభిమాని పూర్తిగా కోలుకున్నారు. ‘కేవలం ఎన్టీఆర్ అన్నయ నాతో మాట్లాడటం వల్లే.. నేను కోలుకున్నాను’ అని ఆ తర్వాత ఆ అభిమాని చెప్పారు. మరి ఇప్పుడు ఈ అభిమాని కూడా అలాగే కోలుకోవాలని ఆశిద్దాం.