Jr NTR : ఎన్టీఆర్ వంద రూపాయల స్మారక నాణెం వేడుకలో జూనియర్ ఎన్టీఆర్ గైర్హాజరు కావడంపై సినీ , రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దీనిపై ఇప్పుడు వివిధ రకాలుగా అభిప్రాయాలు ప్రచారం చేయబడుతున్నాయి. ఈ విషయం గురించి చర్చించే వారి ప్రాధాన్యతలకు అనుగుణంగా ఎన్టీఆర్ గైర్హాజరుకు కారణాలను విశ్లేషిస్తున్నారు.
జూ.ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ కూడా వెళ్లకుండా తమ్ముడి బాటలో నడవడం అనుమానాలకు దారితీసింది. ఎందుకు వీరిద్దరూ వెళ్లలేదన్నది నిజంగా కుటుంబంలోని వారికి మాత్రమే తెలుసు. ముఖ్యంగా ఇటీవల నందమూరి సుహాసిని కుమారుడి వివాహానికి బాలయ్య, మోక్షజ్ఞ , తారక్ హాజరుకావడాన్ని మనం గమనించవచ్చు. ప్రతిష్టాత్మక రూ.100 నాణెం ఈవెంట్ కు రాకపోవడంతో అందరి దృష్టి పడింది.
ఈ రచ్చపై జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తన అభిమానులు వ్యక్తం చేస్తున్న మనోభావాలకు ఏ రకంగానూ స్పందించడం లేదు.. ఎన్టీఆర్ అత్యంత వివేకవంతంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతానికి మౌనం వహిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ సమయంలో ఏం మాట్లాడినా మీడియా దాన్ని చిలవలు పలువలు చేస్తుందని ఎన్టీఆర్ కు తెలుసు. దాన్ని అనేక విధాలుగా అర్థం చేసుకోవచ్చని ఎన్టీఆర్ ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చు.
చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరిపై అధికార వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు తారక్ వీడియో సందేశం ద్వారా ఇలా వ్యవహరించడం కరెక్ట్ కాదంటూ వైసీపీకి హితవు పలికారు. అయితే అది ఎన్టీఆర్ పై ప్రత్యర్థులు విరుచుకుపడేలా చేసింది. ఇలాంటి సున్నితమైన పరిస్థితుల్లో తక్షణ ప్రతిస్పందనలను ఇవ్వకపోవడం తెలివైన పని అని ఎన్టీఆర్ భావిస్తున్నారు. ముఖ్యంగా రాబోయే ఎన్నికల నేపథ్యంలో వివిధ వర్గాలు తమ సొంత రాజకీయ ప్రయోజనాల కోసం ప్రత్యర్థులకు పావులుగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించవచ్చు. అందుకే ఎవరికీ అవకాశం ఇవ్వొద్దనే ఎన్టీఆర్ సైలెన్స్ మెయింటేన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
“దేవర” వంటి పాన్-ఇండియా ప్రాజెక్ట్‌తో తన మార్కెట్ పరిధిని విస్తరించుకోవడానికి చురుకుగా పని చేస్తున్న తారక్‌కి, ఈ సమయంలో ఇటువంటి వాటికి స్పందిస్తే కొన్ని వర్గాలకు ప్రతికూలంగా మారుతాయి. “RRR” తెచ్చిన అంతర్జాతీయ గుర్తింపును ఎన్టీఆర్ కొనసాగించాలని చూస్తున్నారు. అందుకే వివాదాలకు దూరంగా పనిపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యమైనదని భావిస్తున్నారు. దీనికి కొన్ని సందర్భాల్లో నిశ్శబ్దం ఉత్తమ పరిష్కారంగా భావిస్తూ మౌనం దాల్చారు.