CM Jagan Biopic: ఇన్నాళ్లు రాజకీయాల్లో బిజీగా ఉన్న ఏపీ సీఎం జగన్ ఇక సినిమాల్లోకి వెళ్తున్నారా..? త్వరలో ఆయన వెండితెరపై కనిపించనున్నారా..? డౌట్ అక్కర్లేదు. జగన్ ప్రజాసేవలోనే ఉంటారు. అయితే ఆయన ప్రతిరూపం మాత్రం సిల్వర్ స్క్రీన్ పై చూడొచ్చు. అసలు విషయం ఏంటంటే త్వరలో జగన్ బయోపిక్ రాబోతుంది. సీఎం జగన్ జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనల ఆధారంగా ఓ సినిమా నిర్మించనున్నారు. దీనిని దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ ‘యాత్ర’కు సీక్వెల్ గా తీయబోతున్నారు. ‘యాత్ర’ మూవీని తీసిన మహి రాఘవే ఈ సినిమాను రెడీ చేయనున్నారు. అందుకు సంబంధించిన కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారు. ఇక జగన్ పాత్రలో ప్రముఖ విశాల్ నటిస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. త్వరలో సినిమాను ప్రారంభించి ఏపీలో ఎన్నికలకు ముందే రిలీజ్ అయ్యేలా ప్లాన్ వేస్తున్నారు.

ఆంధ్రప్రదేశలో మరో ఏడాదిన్నర కాలంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి అధికారంలోకి రావాలని పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ వైపు ప్రజాకార్యక్రమాలు నిర్వహిస్తూనే.. మరోవైపు తన జీవితంలో పడ్డ కష్టాలను సినిమా ద్వారా ప్రజలకు చెప్పనున్నారు. ఆయన రాజకీయ జీవితం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ముఖ్య సంఘటనలను సినిమాలో చూపించే అవకాశం ఉంది. అధికారంలోకి రావడానికి పడ్డ కష్టాల నుంచి అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టిన సంక్షేమ పథకాల గురించి ఈ సినిమాలో వివరించనున్నారు.
దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం నేపథ్యంలో ‘యాత్ర’ అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో మలయాళ నటుడు మమ్ముట్టి వైఎస్ పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. అచ్చం వైఎస్ లాగే కనిపించి అందరిచేత కన్నీళ్లు పెట్టించారు. 2019 ఎన్నికల ముందు ఈ సినిమా రిలీజ్ చేశారు. దీంతో వైఎస్ జగన్ అధికారంలోకి రావడానికి ఈ సినిమా ప్లస్ గా నిలిచినట్లయింది. దీంతో ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ గా జగన్ బయోపిక్ ను తీసి వచ్చే ఎన్నికల ముందు రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ‘యాత్ర’ సినిమాలో వైఎస్ మరణం వరకు చూపించారు. సీక్వెల్ లో జగన్ గురించి చెప్పనున్నారు. వైఎస్ మరణ తరువాత జగన్ పార్టీ స్థాపన.. జైలు జీవితం.. ఓదార్పు యాత్ర గురించి వివరించే అవకాశం ఉంది. అలాగే పార్టీ అధికారంలోకి వచ్చిన ముఖ్య సంఘటనలపై కూడా ఈ సినిమాలో కొన్ని సీన్స్ ఉంటాయని అంటున్నారు.

ఇక జగన్ పాత్రలో ప్రముఖ నటుడు విశాల్ నటించనున్నారు. తెలుగు గడ్డకు చెందిన విశాల్ తమిళంలో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో జగన్ బయోపిక్ లో నటించాలని విశాల్ ను సంప్రదించగా ఆయన ఒప్పుకున్నట్లు సమాచారం. ‘యాత్ర’ మూవీని తీసిన మహి రాఘవనే జగన్ బయోపిక్ కు కూడా తీర్చి దిద్దనున్నాడు. అయితే ఇంకా ఈ సినిమాలో ఎవరెవరు నటిస్తారనే వివరాలు త్వరలో బయటపెట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఈ తరుణంలో జగన్ బయోపిక్ మూవీ గురించి ఇటు సీనీ.. అటు రాజకీయ రంగాల్లో తీవ్ర చర్చ సాగుతోంది.