Nava Sandeep: ప్రేమ పేరుతో ఓ యువతిని శారీరకంగా వాడుకుని మోసం చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన హైదరాబాద్ మధురానగర్ లో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం జబర్దస్త్ కమెడియన్ నవ సందీప్ 2018నుండి ఒక అమ్మాయితో సన్నిహితంగా ఉంటున్నాడు. ఆ అమ్మాయితో తరచుగా మాట్లాడేవాడు. వాట్సప్ సందేశాలు పంపేవాడు. ప్రేమిస్తున్నానని నమ్మబలికాడు. ఆ యువతి స్వగ్రామం నుండి హైదరాబాద్ కి రప్పించాడు.
గత నాలుగేళ్లుగా ఆ యువతి హైదరాబాద్ లో ఓ హాస్టల్ లో ఉంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలో తరచుగా నవ సందీప్ ఆ అమ్మాయిని కలిసేవాడు. పెళ్లి చేసుకుంటానని శారీరక సంబంధం పెట్టుకున్నాడు. అయితే కొన్నాళ్లుగా అతడి ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఆ యువతిని దూరం పెట్టడంతో పాటు వేరే మహిళను వివాహం చేసుకోబోతున్నట్లు చెప్పాడట.
దాంతో మోసపోయానని గ్రహించిన సదరు యువతి పోలీసులను ఆశ్రయించింది. నవ సందీప్ పై ఫిర్యాదు చేసింది. యువతి సమాచారం మేరకు నవ సందీప్ పై కేసు బుక్ చేసిన పోలీసులు అరెస్ట్ చేశారు. మధురానగర్ లో అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నవ సందీప్ ని పోలీసులు విచారిస్తున్నారు.
నవ సందీప్ కొన్నాళ్లు జబర్దస్త్ లో కమెడియన్ గా చేశాడు. బుల్లితెర కమెడియన్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు. నవ సందీప్ తీరుపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతన్ని కఠినంగా శిక్షించాలని సోషల్ మీడియాలో డిమాండ్ వినిపిస్తుంది.