
తెలుగు హీరో రానా వల్లే ‘బాహుబలి’ హిందీలోకి వెళ్లి అక్కడ ధర్మా ప్రొడక్షన్ బ్యానర్ పై కరణ్ జోహార్ విడుదల చేసి ప్యాన్ ఇండియా మూవీగా అవతరించింది. దీనికి ప్రధాన కారణం రానానే. హిందీ నటులతో, బాలీవుడ్ తో రానాకు మంచి సంబంధాలున్నాయి. ఇక బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ లే కాదు.. అంతర్జాతీయ స్ట్రీమింగ్ దిగ్గజాలతో కూడా పరిచయాలు ఉన్నాయి. ప్యాన్ ఇండియా స్టార్ గా రానాకు క్రేజ్ ఉంది.
అందువల్ల రానా తన సినిమాలకు మంచి ప్రచారం.. మంచి రేటుకు అమ్ముకోగలుగుతున్నారన్న టాక్ ఉంది. కరోనా లాక్ డౌన్ లో రానా తన పరపతితో డిజిటల్ ఓటీటీలను బాగా మెప్పిస్తున్నాడట.. ఈ క్రమంలోనే తన సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ద్వారా సినిమాలు తీసి నెట్ ఫ్లిక్స్ లాంటి అంతర్జాతీయ ఓటీటీ సంస్థలకు కూడా భారీ రేటుకు అమ్ముతున్నాడట.. ఇటీవలే ఓ భారీ ఒప్పందాన్ని ముగించడానికి రానా చర్చలు ప్రారంభించినట్లు చెబుతున్నారు.
కరణ్ జోహర్ ధర్మా ప్రొడక్షన్స్ నెట్ ఫ్లిక్స్ తో ప్రత్యేకమైన భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. క్రమం తప్పకుండా వెబ్ సిరీస్ లు, వెబ్ చిత్రాలను నిర్మిస్తోంది. ఇదే క్రమంలో రానా సైతం నెట్ ఫ్లిక్స్ కోసం ప్రత్యేక వెబ్ సిరీస్ ను ప్లాన్ చేస్తున్నారు.
రానా రాబోయే చిత్రం ‘విరాటపర్వం’ నెట్ ఫ్లిక్స్ కు అమ్ముడైందని కూడా టాక్ నడుస్తోంది. ఈ చిత్రం నేరుగా థియేటర్లకు కాకుండా నెట్ ఫ్లిక్స్ లోనే విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.