
Rajamouli : ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం స్టూడెంట్ నెంబర్ 1 చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. విజయపు ఖాతా తెరిచిన రాజమౌళి.. ఇప్పటి వరకూ అప్రతిహతంగా తన దండయాత్రను కొనసాగిస్తూనే ఉన్నాడు. అయితే.. సినిమా సినిమాకు తన స్థాయిని, సినిమాల హిట్ రేంజ్ ను పెంచుకుంటూ పోతుండడం గమనించాల్సిన అంశం. బాహుబలి(Bahubali) తర్వాత అత్యున్నత స్థాయికి చేరింది దర్శకధీరుడి క్రేజ్. అయితే.. అన్నీ బాగానే ఉన్నప్పటికీ.. రాజమౌళిపై ఒకే ఒక్క రిమార్క్ ఉంది.
అదేమంటే.. తన సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎవ్వరికీ తెలియదు. ఇంకా చెప్పాలంటే.. ఆయనకు కూడా తెలియదు. చాలా మంది దర్శకుడు రిలీజ్ డేట్ చెప్పేస్తారు. ఆ సమయానికి కాస్త అటూ ఇటుగా రిలీజ్ చేసేస్తారు. ఇక, పూరీ జగన్నాథ్ లాంటి వారు సినిమా ప్రారంభానికి ముందే.. ఓపెనింగ్, రిలీజ్ డేట్లు ప్రకటించేస్తారు. విడుదల కూడా సరిగ్గా అదే సమయానికి అవుతుంది. కానీ.. రాజమౌళి విషయంలో పూర్తి భిన్నంగా ఉంటుంది. థియేటర్లో బొమ్మ పడే వరకూ డౌటే.
దీనికి కారణం లేకపోలేదు. తన సినిమా షూటింగ్ అయిపోన తర్వాత కూడా.. మళ్లీ మళ్లీ చెకింగ్ చేసుకుంటూనే ఉంటాడు రాజమౌళి. ఈ క్రమంలో ఎక్కడైనా సరిగా రాలేదు అనిపిస్తే.. వెంటనే రీషూట్ చేయాల్సిందే. ఈ విధంగా అమరశిల్పి జక్కన్నలా చెక్కీ చెక్కీ.. తాను అనుకున్న రూపం వచ్చిందని డిసైడ్ అయిన తర్వాతనే సినిమాను వదులుతాడు. అందుకే.. రాజమౌళి సినిమా అంటే.. మినిమం ఏడాది. మాగ్జిమమ్ చెప్పలేం అన్నట్టుగా తయారైంది పరిస్థితి.
అయితే.. ఇప్పుడు లేటెస్ట్ విషయం ఏమంటే.. ఈ పరిస్థితిని తిరగరాసేందుకు సిద్ధమయ్యాడట రాజమౌళి. కేవలం 6 నెలల్లో సినిమా స్టార్ట్ చేసి, రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యాడట. RRR తర్వాత మహేష్ బాబుతో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పుడు సర్కారు వారి పాటతో బిజీగా ఉన్న మహేష్(Mahesh babu).. దీని తర్వాత త్రివిక్రమ్(Trivikram) తో ఓ సినిమా చేయనున్నాడు. ఆ చిత్రానికి ఎంత లేదన్నా ఆరు నుంచి 8 నెలలు పడుతుంది. సర్కారు వారిపాట రిలీజ్ అయ్యేలోగా RRR రిలీజ్ కూడా కాస్త గ్యాప్ తో అయిపోతుంది. కాబట్టి.. త్రివిక్రమ్ సినిమా పూర్తయ్యేలోగా.. తాను కూడా ఓ బాలీవుడ్ మూవీ తీసేయాలని జక్కన్న నిర్ణయించుకున్నాడట.
ఫిల్మ్ నగర్ లో ఈ మేరకు ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అయితే.. దీన్ని పూర్తిగా కాదనే పరిస్థితి కూడా లేదు. సంక్రాంతికే RRR రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నాడు రాజమౌళి. ఆ తర్వాత ఖాళీనే. కాబట్టి.. మరో సినిమాను అనుకోవచ్చు కూడా. కానీ.. ఆర్నెల్లలో రిలీజ్ చేయడం అనేదానిపైనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు చాలా మంది. మరి, ఏం జరుగుతుందన్నది చూడాలి.