దేవుడే లేడనే మనిషి ఉన్నాడు గానీ, అమ్మ లేదనే మనిషి లేడు. ఓర్పును నేర్పును నేర్పించేదే అమ్మ. అలుపెరగని పోరాటం అమ్మది. ఈ రోజు సూపర్ స్టార్ కృష్ణ అంటూ యావత్తు సినీ లోకం మహేష్ ఫ్యామిలీని కీర్తిస్తున్నా.. నిజానికి ఆ ఘనమైన కీర్తికి కారణం.. కృష్ణగారి తల్లిగారు ‘నాగరత్నమ్మ గారు’. తన కొడుకు సినిమా రంగంలో రాణిస్తాడని నమ్మిన మొదటి వ్యక్తి ఆమె.
ఎవరు కనిపించినా.. ‘కుర్రాడు పొడగరి, పైగా ఎర్రటి రంగు, మంచి అందగాడు, ఆ ముక్కు, ఆ ముఖం తీరు.. నా కొడుకు మరో ఎన్టీఆర్ అవుతాడు’ అంటూ ఆమె తెగ సంతోష పడి పోయేది. అందుకే, ఆ రోజుల్లో ఎన్నడూ ఊరు కూడా దాటని ఆవిడ, కొడుకు కృష్ణను తీసుకుని మద్రాసు వెళ్ళింది. చుట్టూ జనం హేళన చేశారు. అయినవాళ్లు కూడా అవమానించారు.
అయినా ‘నాగరత్నమ్మ గారు’ మద్రాసులో ఓ రూము అద్దెకు తీసుకుని కృష్ణ గారితో పాటు అక్కడే ఉండిపోయారు. కృష్ణ అవకాశాల కోసం ఆఫీస్ ల చుట్టూ తిరుగుతూ ఉంటే.. ‘నాగరత్నమ్మ గారు’ వంట చేసుకుని కృష్ణ కోసం ఆ ఆఫీస్ ల దగ్గరకు వెళ్ళేవారు. కొన్ని సార్లు ఆమె కృష్ణ గారితో పాటు సినిమా ఆఫీస్ కి వెళ్లి.. ‘మా అబ్బాయి బాగా చేస్తాడు, చూడండి. మంచి అందగాడు కూడా. ఒక్క ఛాన్స్ ఇవ్వండి’ అంటూ బతిమిలాడేవారు.
కృష్ణ గారి కుటుంబానికి జగ్గయ్య గారు బాగా పరిచయం. కొడుకు కోసం తెనాలి నుండి ‘నాగరత్నమ్మ గారు’ ఇలా మద్రాసు వచ్చి అవకాశాల కోసం ప్రయత్నాలు చేయడం ఆయనను బాగా ఆకట్టుకుంది. అందుకే తాను చేస్తున్న ‘పదండి ముందుకు’ అనే సినిమాలో కృష్ణకు ఓ చిన్న వేషం ఇచ్చారు. జెండాలు పట్టుకుని నిలబడే ఓ బృందంలో ఒక వ్యక్తిగా కృష్ణ కనిపిస్తారు.
కానీ, ఆ తొలి అవకాశమే కృష్ణకు తన మీద తనకు నమ్మకం పెంచింది. ఇక అప్పటి నుండి కృష్ణ వెనక్కి తిరిగి చూసుకోలేదు. హీరో అయ్యారు, తక్కువ సమయంలోనే సూపర్ స్టార్ అయ్యారు. అయితే, ఆయన సక్సెస్ కి అసలైన కారణం మాత్రం ‘నాగరత్నమ్మ గారే’.