
Pelli SandaD Movie: దర్శకుడు కె.రాఘవేంద్రరావు అంటే.. శతాధిక చిత్రాల మేటి దర్శకుడు. అంతటి అనుభవం ఉన్న గొప్ప దర్శకుడు నుంచి ‘పెళ్లి సందD’ లాంటి దిగువస్థాయి సినిమా ఎలా వచ్చింది ? అసలు ఈ సినిమా కథను రాఘవేంద్రరావు విన్నారా ? ఈ సినిమా స్క్రిప్ట్ ను అసలు ఆయన చదివారా ? ఈ రెండు మూడు సంవత్సరాలలో ఇంత దిగజారిన చిత్రం రాలేదు అంటే.. అతిశయోక్తి కాదు.
కచ్చితంగా చెప్పొచ్చు, దర్శకత్వంలో ఆయనకు తిరుగులేదని.. స్టార్ హీరోల కెరీర్ లో ఆయన ఎన్నో మర్చిపోలేని సూపర్ హిట్లును అందించాడు. కానీ పెరిగిన వయసు రీత్యా, తగ్గిన ఆలోచనా శక్తి దృష్ట్యా మొత్తానికి ఆయన నుంచి ఓ చెత్త సినిమా వచ్చింది . ప్రేక్షకులు సినిమా చూసి పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా సినిమా కథలోని లొసుగులు చూసి కలత చెందుతున్నారు.
రెండున్నర గంటల పాటు టార్చర్ భరించలేక మధ్యలోనే లేచి వెళ్లిపోతున్నారు. ఒక సినిమా బాగాలేదు అని మధ్యలోనే లేచివెళ్లిపోయింది ఈ మధ్య కాలంలో ఈ ఒక్క సినిమాకే. ఇది చాలదా ? రాఘవేంద్రరావు ‘పెళ్లి సందD’ ఎలా ఉందో చెప్పడానికి ? పైగా ఇన్నేళ్ల తన సుదీర్ఘ ప్రస్థానంలో రాఘవేంద్రరావు తొలిసారి కెమెరా ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో వశిష్ట అనే ఓ కీలక పాత్రను పోషించారు.
కానీ రాఘవేంద్రరావు అంటే.. గొప్ప దిగ్గజ దర్శకుడు. అలాంటి దర్శకుడు స్క్రీన్ పై పేలవంగా నటించడం ఆయన అభిమానుల దురదృష్టకరం. ఆ మాటకొస్తే ఆయనకు నటన పై అసలు ఆసక్తి లేదు. అలాంటప్పుడు నటించకుండా ఉండాలి. కానీ నటించి స్థాయిని ఎందుకు తగ్గించుకోవడం ? ఏది ఏమైనా ఇండస్ట్రీలో ఉన్న ఎందరో గొప్ప దర్శకులకు కథల విషయంలో రాఘవేంద్రరావు ఎన్నో సూచనలు, సలహాలూ ఇస్తుంటారు.
వివిధ సందర్భాల్లో రాజమౌళి దగ్గర నుంచి క్రిష్ వరకూ ‘మా విజయాలకు రాఘవేంద్రరావు సలహాలు ఎంతో ఉపయోగపడ్డాయి’ అని చెప్పుకొచ్చారు. కానీ చివరకు రాఘవేంద్రరావు కెరీర్ లో అతి దారుణమైన పరాజయం చూడటం ఈ సినిమాతోనే సాధ్యం అయింది.